Telangana Weather Alert: తెలంగాణలో నిప్పుల కొలిమి: 18 జిల్లాలకు 'రెడ్ అలర్ట్'.. వడదెబ్బతో 34 మంది మృతి!

Telangana Weather Alert: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి! 18 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 23 May 2026 11:58 AM IST
Telangana Weather Alert
X

Telangana Weather Alert: తెలంగాణలో నిప్పుల కొలిమి: 18 జిల్లాలకు 'రెడ్ అలర్ట్'.. వడదెబ్బతో 34 మంది మృతి!

Heatwave: తెలంగాణలో భానుడి భగభగలు తీవ్రరూపం దాల్చాయి. వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా జనం అల్లాడిపోతున్నారు. ఇప్పటికే 18కి పైగా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయి. పరిస్థితి అత్యంత తీవ్రంగా మారడంతో వాతావరణ శాఖ అధికారులు ఆయా 18 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేశారు. అటు రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి, ఇక్కడ 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది.

ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాలు తీవ్రమైన వడగాలుల (Heat Waves) ప్రభావానికి గురవుతున్నాయి. వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

అసలు వడదెబ్బ (Heat Stroke) అంటే ఏంటి?

వైద్య నిపుణుల ప్రకారం.. హీట్ స్ట్రోక్ అనేది శరీరంలో నీటి శాతం పూర్తిగా తగ్గిపోయే (Dehydration) ప్రమాదకర పరిస్థితి. ఇందులో మూడు రకాలు ఉంటాయి:

హీట్ ఎగ్జాషన్ (Heat Exhaustion): తీవ్రమైన వేడి, గాలిలో తేమ వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. కండరాల నొప్పులు వస్తాయి.

హీట్ ఇంజురీ (Heat Injury): ఈ స్థితిలో శరీర అంతర్గత భాగాలు దెబ్బతినడం ప్రారంభమవుతుంది. కిడ్నీలు, గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది.

హీట్ స్ట్రోక్ (Heat Stroke): ఇది అత్యంత ప్రమాదకరమైన చివరి స్టేజ్. దీనివల్ల మెదడు పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. మనిషి ఫిట్స్‌కు గురికావడం లేదా అపస్మారక స్థితి (కోమా) లోకి వెళ్లే ప్రమాదం ఉంది. సకాలంలో స్పందించకపోతే ప్రాణాలు పోతాయి.

వడదెబ్బ తగలకుండా వైద్యుల హెల్త్ టిప్స్:

ఎండల బారి నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.

సమయం ముఖ్యం: ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో అస్సలు తిరగవద్దు. ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే తలపాగా, గొడుగు, చలవ కళ్లజోడు ధరించండి.

హైడ్రేషన్‌ ప్రథమ కర్తవ్యం: దాహం వేసినా, వేయకపోయినా నిరంతరం నీళ్లు తాగుతూ ఉండాలి. శరీరం కోల్పోయిన లవణాలను భర్తీ చేయడానికి ఓఆర్‌ఎస్ (ORS) లాయణం, కొబ్బరి నీళ్లు, ఉప్పు-చక్కెర కలిపిన నిమ్మరసం, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.

మద్యానికి దూరం: ఆల్కహాల్ శరీరంలోని నీటి శాతాన్ని వేగంగా తగ్గించి డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. కాబట్టి ఎండాకాలంలో మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.

దుస్తుల ఎంపిక: ముదురు రంగు (Dark colors) బట్టలు వేడిని ఎక్కువగా లాక్కుంటాయి. కాబట్టి తేలికపాటి, లేత రంగు (Light colors) కాటన్ దుస్తులనే ధరించాలి.

ఆహారం - పండ్లు: నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, దానిమ్మ, బత్తాయి వంటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

రోగులకు సూచన: షుగర్, బీపీ ఉన్న రోగులు ఎండ తీవ్రతకు గురికాకుండా తమ మందులను సక్రమంగా వేసుకోవాలి. వేసవిలో వ్యాయామాలను ఉదయం 8 గంటల లోపే ముగించుకోవడం మంచిది.

ముఖ్య గమనిక: ఎవరికైనా వడదెబ్బ లక్షణాలు (తీవ్రమైన జ్వరం, వాంతులు, తలతిరగడం, పల్స్ పడిపోవడం) కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే నీడకు చేర్చి, చల్లటి నీటితో తడిపి, తక్షణమే ఆసుపత్రికి తరలించాలి. నిర్లక్ష్యం ప్రాణాంతకం కావచ్చు!

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story