Women Health : తెలంగాణ మహిళలకు 'డిజిటల్' రక్షణ.. 46 లక్షల మందికి 30 రకాల ఉచిత పరీక్షలు
Women Health : తెలంగాణ ప్రభుత్వం 46 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు 30 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తోంది. ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Telangana Women Health
Women Health : తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా ఆరోగ్య మహిళ దిశగా మరో భారీ అడుగు వేసింది. స్వాభిమానం, సాధికారిత కలిగిన సమాజం కోసం మహిళల ఆరోగ్యానికి డిజిటల్ రక్షణ కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 46 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి కోసం డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ మహిళల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయనున్నారు.
ఈ మెగా హెల్త్ స్క్రీనింగ్ ప్లాన్ ప్రకారం.. ప్రతి మహిళకు దాదాపు 30 రకాల కీలక వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. కేవలం సాధారణ రక్తహీనత, బీపీ, షుగర్ స్థాయిలే కాకుండా.. థైరాయిడ్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ముందే గుర్తించేలా పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల ఫలితాలను 24 గంటల్లోనే ఫోన్లకు పంపిస్తారు. అంతేకాకుండా, ప్రతి మహిళకు ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డ్ అందజేస్తారు. ఈ డేటా మొత్తం ప్రభుత్వ ఈ-హెచ్ఎంఐఎస్ (e-HMIS) పోర్టల్‌లో భద్రంగా ఉంటుంది, తద్వారా భవిష్యత్తులో ఎక్కడ చికిత్స పొందినా డాక్టర్లు పాత రిపోర్టులను వెంటనే చూసి సరైన మందులు ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఈ బృహత్తర కార్యక్రమం మొత్తం మూడు దశల్లో, సుమారు ఆరు నెలల పాటు కొనసాగుతుంది. మొదటి దశలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాలు, రెండో దశలో మరో 10 మండలాలు, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, పట్టణాల్లో బస్తీ దవాఖానాల సహకారంతో మహిళలను దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తారు. దీనివల్ల తెలియకుండానే గంభీరమైన జబ్బుల బారిన పడుతున్న వేలాది మంది మహిళలకు సకాలంలో వైద్యం అందనుంది.
మరోవైపు, 14 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించేందుకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. సుమారు 4 లక్షల మంది బాలికలకు ఈ టీకాలు అందజేయనున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ పరిధిలోని 145 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పాలిక్లినిక్స్‌గా అప్‌గ్రేడ్ చేసి, స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలను పేదలకు చేరువ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డిజిటల్ హెల్త్ విప్లవం ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలను కేవలం గుర్తించడమే కాకుండా, వారి ఆయుష్షును పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం గట్టి భరోసా ఇస్తోంది.




