Hanumakonda: హనుమకొండలో ఉద్రిక్తత.. 360 గుడిసెలు కూల్చివేత..

Hanumakonda: హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్తత. ఐదేళ్లుగా నివసిస్తున్న పేదల 360 గుడిసెలను అధికారులు రాత్రికి రాత్రే తొలగించడంతో స్థానికుల భారీ నిరసన. ఆధార్, రేషన్ కార్డులు ఉన్నా కూల్చేశారని ఆవేదన.

Arun Chilukuri
Published on: 20 Jun 2026 12:45 PM IST
Hanumakonda
X

Hanumakonda: హనుమకొండలో ఉద్రిక్తత.. 360 గుడిసెలు కూల్చివేత..

Hanumakonda: హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలో భారీ కూల్చివేతల ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక లిక్కర్‌ ప్లాంట్‌ సమీపంలో పేదలు వేసుకున్న సుమారు 360 గుడిసెలను ప్రభుత్వ అధికారులు హఠాత్తుగా తొలగించడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమ ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ బాధితులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

బాధితులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్ల సింగారంలోని సదరు స్థలంలో గత ఐదేళ్లుగా వందలాది పేద కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసముంటున్నాయి. తాము ఇక్కడే స్థిరపడ్డామని, ప్రభుత్వమే తమకు ఇక్కడి చిరునామాతో ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు కూడా జారీ చేసిందని వారు గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉండి, ఐదేళ్లుగా ఇక్కడే బతుకుతున్న తమను ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా వచ్చి ఖాళీ చేయించడం ఏంటని అధికారులను నిలదీశారు.

అధికారులు జరిపిన ఈ ఆకస్మిక కూల్చివేతలతో వందలాది కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. సామాగ్రిని కూడా సర్దుకునే లోపే గుడిసెలను తొలగించారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇళ్లను కోల్పోయిన మహిళలు, పిల్లలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే నిరసనకు దిగారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని, అప్పటివరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని స్థానికులు స్పష్టం చేశారు. బాధితుల నిరసనతో గుండ్ల సింగారంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story