బీఆర్‌ఎస్ 'యువ సంగ్రామ సదస్సు'కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. పోలీసుల అభ్యంతరాలు తిరస్కరణ!
BRS: సరూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
బీఆర్‌ఎస్ 'యువ సంగ్రామ సదస్సు'కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. పోలీసుల అభ్యంతరాలు తిరస్కరణ!
BRS: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం వేదికగా శనివారం బీఆర్‌ఎస్ (BRS) నిర్వహించ తలపెట్టిన ప్రతిష్టాత్మక 'యువ సంగ్రామ సదస్సు'కు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (TG High Court) పచ్చజెండా ఊపింది. ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గులాబీ పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కొన్ని కీలక షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది.
కోర్టు విధించిన నిబంధనలు ఇవే..
యువ సంగ్రామ సదస్సును పూర్తిగా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని బీఆర్‌ఎస్ శ్రేణులను హైకోర్టు ఆదేశించింది. సభ పేరుతో.. సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలిగేలా రహదారుల దిగ్బంధం (ట్రాఫిక్ జామ్) చేయకూడదు. ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధానాలు ఉండొద్దని కోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం
బీఆర్‌ఎస్ సభకు అనుమతి ఇస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, దీనిపై స్పష్టమైన ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఉందని హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే హైకోర్టుకు నివేదించారు. అంతేకాకుండా, సదస్సు నిర్వహించే ప్రాంతంలో సరైన పార్కింగ్ ఏర్పాట్లు కూడా లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ఈ వాదనలపై ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. బీఆర్‌ఎస్ నాయకులు 17 రోజుల క్రితమే సభ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేసిన కోర్టు.. "ఇంతకాలం దీనిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? పార్కింగ్ లేదా మరేదైనా సమస్య ఉంటే ఆ సమాచారాన్ని ముందే వారికి ఎందుకు లేఖ ద్వారా తెలపలేదు?" అని పోలీసుల తీరును తప్పుపట్టింది. చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడాన్ని ఆక్షేపిస్తూ, సదస్సు నిర్వహణకు అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.




