TGCSB: తెలంగాణ ప్రజలే టార్గెట్.. ఢిల్లీలో సైబర్ మోసం ముఠా గుట్టురట్టు
ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్లతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను TGCSB పట్టుకుంది. 21 మంది మహిళా టెలీకాలర్లు అరెస్ట్.
Telangana Cyber Security Bureau
ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్ల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఛేదించింది. ఈ ఆపరేషన్‌లో 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలీకాలర్లతో పాటు ఒక బ్యాంకు ఖాతాదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
TGCSB అధికారులు ఢిల్లీలోని మూడు సైబర్ క్రైమ్ కాల్ సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్న ముగ్గురు కీలక నిర్వాహకులను గుర్తించినట్లు TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ సోమవారం తెలిపారు. లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని వెల్లడించారు.
ఢిల్లీలోని శివ మార్కెట్ నుంచి ఈ మూడు కాల్ సెంటర్లు వేర్వేరు బృందాలతో సుమారు ఏడాదిన్నరగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అరెస్టయిన వారిలో టీమ్ లీడర్లు, టెలీకాలర్లు, ఒక బ్యాంకు ఖాతాదారుడు ఉన్నారు.
తెలుగు మాట్లాడే మహిళలతో టార్గెట్
25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని బాధితుల నమ్మకాన్ని పొందేందుకు ముఠా ప్రయత్నించేది. తెలంగాణలోని అమాయకులను లక్ష్యంగా చేసుకుని బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులుగా పరిచయం చేసుకునేవారు. ఆకర్షణీయమైన రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడేవారు.
లోన్ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు, ఇన్సూరెన్స్ ప్రీమియం తదితర పేర్లతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. డబ్బు అందుకున్న తర్వాత బాధితులతో సంబంధాలు తెంచుకోవడం లేదా లోన్ మంజూరు చేస్తామంటూ మరిన్ని చెల్లింపులు చేయించేవారు.
22 సైబర్ క్రైమ్ కేసులతో లింకులు
ఈ ఆపరేషన్‌లో 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు పాస్‌బుక్‌లను TGCSB అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన 22 సైబర్ క్రైమ్ కేసులతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని ఈ ముఠా పక్కా వ్యవస్థతో సైబర్ మోసాలు సాగించినట్లు వెల్లడైంది. అరెస్టయిన టెలీకాలర్లలో పలువురు జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు.
డబ్బులు అడిగితే బెదిరింపులు, బ్లాక్‌మెయిల్
బాధితులు లావాదేవీలపై ప్రశ్నించినా, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా నిందితులు బెదిరింపులకు పాల్పడేవారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పరువు తీస్తామని, వ్యక్తిగత సమాచారం, గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తామని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసేవారని దర్యాప్తులో తేలింది.




