TGSRTC: టీజీఎస్ఆర్టీసీ మరో విప్లవాత్మక అడుగు.. త్వరలోనే రోడ్డెక్కనున్న ఈ-ఆటోలు!
TGSRTC: తెలంగాణలో బస్సు ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్' కనెక్టివిటీకి శ్రీకారం చుట్టింది.
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ మరో విప్లవాత్మక అడుగు.. త్వరలోనే రోడ్డెక్కనున్న ఈ-ఆటోలు!
TGSRTC: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత సులభతరం మరియు సౌకర్యవంతంగా మార్చే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రయాణికులకు ఇంటి నుంచి బస్ స్టాప్ వరకు, అలాగే బస్సు దిగిన తర్వాత గమ్యస్థానం వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్' (First Mile to Last Mile) కనెక్టివిటీ విధానాన్ని అమలు చేయనుంది.
ఇందులో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో సొంత ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటో తయారీ సంస్థలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు కొలిక్కి వచ్చిన వెంటనే ఈ-ఆటోలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
ఈ నూతన విధానంలో ప్రయాణికులు తమ బస్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే అదనంగా ఆటో రైడ్‌ను కూడా ఒకేసారి బుక్ చేసుకునేలా ప్రత్యేక సౌకర్యం కల్పిస్తారు. దీని ద్వారా ప్రయాణికులను వారి నివాసం నుంచి సమీప బస్ పాయింట్‌కు, అలాగే బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి వారి చివరి గమ్యస్థానానికి ఈ-ఆటోలు సురక్షితంగా చేరవేస్తాయి. ఫలితంగా ప్రయాణికులకు విలువైన సమయం ఆదా అవ్వడమే కాకుండా రవాణా ప్రయాసలు తప్పుతాయి.
ఈ ఎలక్ట్రిక్ ఆటో సేవలను ప్రయోగాత్మకంగా మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఇక్కడ లభించే స్పందన ఆధారంగా రెండో దశలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాలకు విస్తరించనున్నారు.
ప్రస్తుతం నగరంలో అధిక ఛార్జీలతో నడుస్తున్న ఓలా (Ola), ఉబర్ (Uber), ర్యాపిడో (Rapido) వంటి ప్రైవేట్ రైడ్ హెయిలింగ్ యాప్‌ల కంటే గణనీయంగా తక్కువ ఛార్జీలతో ఈ సేవలను అందించేలా ఆర్టీసీ ప్రణాళిక రూపొందిస్తోంది. దీనివల్ల హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్, మియాపూర్, పటాన్‌చెరు, శంషాబాద్, ఘట్‌కేసర్ ప్రాంతాల ప్రజలకు కనెక్టివిటీ సమస్యల నుంచి తీవ్ర ఊరట లభించనుంది.




