TGSRTC Recruitment : నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ పోస్టుల భర్తీ

TGSRTC Recruitment : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె దృష్ట్యా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి టీజీఎస్‌ఆర్టీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న నిరుద్యోగులు వెంటనే డిపోల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

CR Reddy
Published on: 24 April 2026 8:46 AM IST
TGSRTC Recruitment
X

TGSRTC Recruitment

TGSRTC Recruitment : తెలంగాణలో గత రెండు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్ర రవాణా వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో సామాన్య ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు, ప్రజలకు రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) సంచలన నిర్ణయం తీసుకుంది. సమ్మె దృష్ట్యా ప్రత్యామ్నాయంగా తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో నియామక ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది.

యుద్ధ ప్రాతిపదికన నియామకాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం బస్సులను నిలిపివేసి ఆందోళనలు బాట పట్టడంతో, సర్కార్ ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా వేసవి సెలవుల కారణంగా రద్దీ ఎక్కువగా ఉండటం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా నియమించుకుని బస్సులను రోడ్డెక్కించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా అన్ని జిల్లాల డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

అర్హత ఉంటే వెంటనే కొలువు

హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు, కండక్టర్ పని చేసే అనుభవం ఉన్న వారు నేరుగా తమ సమీపంలోని డిపోలను సంప్రదించవచ్చు. డిపో మేనేజర్లు దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న వారిని వెంటనే విధుల్లోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల అద్దె బస్సులను ప్రైవేట్ డ్రైవర్లతో నడుపుతుండగా, కొత్త నియామకాలతో సర్వీసుల సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులను కూడా వీలైనంత ఎక్కువగా అందుబాటులోకి తెస్తున్నారు.

హైదరాబాద్‌లో నిలిచిన చక్రం.. ప్రయాణికుల ఆవేదన

రాజధాని హైదరాబాద్‌లో బస్సులు లేక పరిస్థితి దారుణంగా మారింది. కూకట్‌పల్లి, ఉప్పల్, మేడ్చల్, మియాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆఫీసులకు వెళ్లేవారు, సామాన్య కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు ఇదే అదునుగా భావించి మూడు నాలుగు రెట్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ఇబ్బందులను తొలగించేందుకు జీడీమెట్ల, రాణిగంజ్, కుషాయిగూడ, హెచ్‌సీయూ వంటి కీలక డిపోల పరిధిలో తాత్కాలిక ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

డిపో మేనేజర్లను సంప్రదించండి

నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. సమ్మె కాలం ముగిసే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ తాత్కాలిక నియామకాలు కొనసాగుతాయి. ఆయా డిపోల ఫోన్ నెంబర్లు,హెల్ప్ లైన్ కేంద్రాలు అందుబాటులో ఉంచారు. ఆసక్తి గల వారు వెంటనే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, లైసెన్స్‌తో డిపో కార్యాలయాలకు వెళ్లాలని కోరుతున్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ స్పష్టం చేసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story