TGSRTC Strike : తెలంగాణలో ఆర్టీసీ బస్సుల బంద్.. సమ్మెలోకి కార్మికులు.. డిపోల వద్ద ఉద్రిక్తత

TGSRTC Strike :తెలంగాణలో టీజీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమైంది. చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వం అధికారుల కమిటీ వేసినా కార్మికులు సమ్మెకే మొగ్గు చూపారు.

CR Reddy
Published on: 22 April 2026 7:04 AM IST
TGSRTC Strike
X

TGSRTC Strike

TGSRTC Strike : తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో జేఏసీ (JAC) పిలుపు మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు విధులను బహిష్కరించారు. దీంతో తెల్లవారుజాము నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు బస్టాండ్ల వద్ద బస్సులు లేక దిక్కుతోచని స్థితిలో కనిపిస్తున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ (PRC), రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలపై టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నాయకులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు. గత నెలలోనే సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదు. ప్రభుత్వం నలుగురు అధికారులతో కమిటీ వేసి, నాలుగు వారాల సమయం కోరగా.. దానిని జేఏసీ తిరస్కరించింది. మాయ మాటలతో కాలయాపన చేస్తున్నారని మండిపడుతూ సమ్మెను ప్రకటించింది.

ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లో ఉండటంతో ప్రతిరోజూ లక్షలాది మంది ఆర్టీసీపైనే ఆధారపడుతున్నారు. సడన్‌గా బస్సులు బంద్ కావడంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం షిఫ్ట్ నుంచి డ్రైవర్లు, కండక్టర్లు ఎవరూ విధులకు హాజరు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9,000 పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేట్ వాహనదారులు దీన్ని ఆసరాగా చేసుకుని భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.

సమ్మెపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూలంగా ఉందన్నారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పేదలకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని, అధికారుల కమిటీకి తమ సమస్యలను విన్నవించాలని ఆయన కార్మికులకు సూచించారు. బెషజాలకు పోకుండా విధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే, హామీలు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story