Mahesh Kumar Goud: భవిష్యత్తులో బీసీ నేతే ముఖ్యమంత్రి.. కేసీఆర్, కేటీఆర్‌లకు ఆ దమ్ముందా?
Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో 'బీసీ ముఖ్యమంత్రి' అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
Mahesh Kumar Goud: భవిష్యత్తులో బీసీ నేతే ముఖ్యమంత్రి.. కేసీఆర్, కేటీఆర్‌లకు ఆ దమ్ముందా?
Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో 'బీసీ ముఖ్యమంత్రి' అంశం మరోసారి చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుండే బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై విమర్శల జడివాన కురిపించారు. తమ పార్టీ నుండి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పే దమ్ము కేసీఆర్, కేటీఆర్ లేదా బీజేపీ రాష్ట్ర నేతలకు ఉందా? అని ఆయన నిలదీశారు.
బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే డిక్లరేషన్ ప్రకటించి, చట్టం చేసిందని ఆయన తెలిపారు. ఇది సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ వేసిన పెద్ద అడుగని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఎప్పుడూ బీసీ వ్యతిరేకులేనని, వారి మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండదని ఆరోపించారు.
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం చారిత్రాత్మకమని మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ బియ్యం విషయంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తూ వారి ఆకలి తీరుస్తోందని, బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం నుండి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తున్నామని చెప్పారు.
ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, తమ పార్టీల్లో బీసీలకు ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.




