Shamshabad Accident: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

Shamshabad Accident: తెలంగాణలోని శంషాబాద్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

CR Reddy
Published on: 19 Sept 2026 7:05 AM IST
Shamshabad Accident
X

Shamshabad Accident

Shamshabad Accident: తెలంగాణలోని శంషాబాద్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఇన్నోవా కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును అత్యంత బలంగా ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొని తమ స్వగ్రామం నుంచి శంషాబాద్‌ వైపు వస్తున్న సమయంలో ఈ విషాద ఘటన జరగడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం.. పాల్మాకుల గ్రామ శివారులోని నేషనల్ హైవే-44 పై ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న వేగంగా వస్తున్న ఇన్నోవా వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పడంతో రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. కారు ఢీకొన్న వేగానికి వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం మేట్టుగడ్డ తండాకు చెందిన కేతావత్ లింబ్యా (54), కేతావత్ జమున (45), కత్రావత్ మాన్సింగ్ (48), కేతావత్ వస్రాం (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో ఇన్నోవా డ్రైవర్ శాబావత్ అశోక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ అశోక్‌ను వెంటనే చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మృతి చెందిన నలుగురి భౌతిక కాయాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా శంషాబాద్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా ఐదు రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదంలో దుబాయ్ వెళ్లాల్సిన ఒక ఎన్‌ఆర్‌ఐ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో నవాబ్‌పేట్ మండలం మేట్టుగడ్డ తండాలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగ వాతావరణంలో జరగాల్సిన ఇళ్లలో చావు కేకలు వినబడటంతో గ్రామం మొత్తం కన్నీరు మున్నీరవుతోంది. వేగంగా వాహనాలు నడపడం, నిద్రమత్తు లేదా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఇలాంటి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని, రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.