Trainee IPS Uday Krishna Reddy: ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో సంచలనం.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రెండో మహిళా..

Uday Krishna Reddy: ట్రైనీ మహిళా ఐపీఎస్‌పై వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Arun Chilukuri
Updated on: 3 Aug 2026 10:15 AM IST
Trainee IPS Uday Krishna Reddy
X

Trainee IPS Uday Krishna Reddy: ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో సంచలనం.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రెండో మహిళా..

Uday Krishna Reddy: తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ అయిన ఉదయ్‌ కృష్ణారెడ్డి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ విచారణలో నిందితుడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉదయ్‌ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యనాయక్‌ జాదవ్‌ పర్యవేక్షిస్తున్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా అత్తాపూర్‌ పోలీసులు, దర్యాప్తు బృందం అశోక్‌నగర్‌లోని ఉదయ్‌ కృష్ణారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేపట్టారు. ఈ సోదాల్లో ఒక ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, కత్తితో పాటు ఇద్దరి చేతిరాతతో ఉన్న రెండు ప్రేమలేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖల్లో ఉన్న పేర్ల ఆధారంగా దర్యాప్తు చేయగా మరో మహిళా కోణం బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళకు 2014లోనే వివాహమైంది. అయితే, కుటుంబ సమస్యల కారణంగా 2023 నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటూ తన కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. ఆ సమయంలో పరిచయమైన ఉదయ్‌ కృష్ణారెడ్డితో ఆమెకు స్నేహం ఏర్పడింది. అనంతరం హైదరాబాద్‌ వచ్చిన ఆమె ఒక ప్రైవేటు సంస్థలో పనిచేశారు.

ఈ ఏడాది జనవరిలో ఉదయ్‌ సూచన మేరకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, అశోక్‌నగర్‌లోని ఓ ఐఏఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆమెను 'లివ్‌ ఇన్‌ రిలేషన్‌'లో ఉందామని కోరగా, భర్త నుంచి ఇంకా చట్టబద్ధమైన విడాకులు రాకపోవడంతో ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అశోక్‌నగర్‌లో ఉంటున్న సదరు మహిళను ఫిర్యాదుదారుడైన మహిళా ట్రైనీ ఐపీఎస్‌ కలిశారు. ఉదయ్‌ కృష్ణారెడ్డి విపరీత ప్రవర్తన, తనపై జరిపిన దాడి, మానసిక వేధింపుల గురించి ఆమెతో పంచుకున్నారు. ఉదయ్ అసలు స్వరూపాన్ని తెలుసుకున్న ఆ మహిళ అప్పటి నుంచి అతడికి దూరంగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది.

ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు సుమారు 20 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలను సేకరించారు. మహిళా ట్రైనీ ఐపీఎస్‌ గదిలోకి ఉదయ్‌ బలవంతంగా చొరబడి, ఆమె ఫోన్‌ను లాక్కున్న మాట వాస్తవమేనని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. శిక్షణ సమయంలోనూ ఉదయ్‌ కృష్ణారెడ్డి తీవ్రమైన కోపం, విపరీత ప్రవర్తన కారణంగా పలువురు తోటి అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ఉదయ్‌ కృష్ణారెడ్డిని పోలీసు కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story