Mutyam Venkata Ramana: ఏసీబీ చరిత్రలోనే బిగ్గెస్ట్ రైడ్.. రెడ్కో డీజీఎం వెంకటరమణ అరెస్ట్
Mutyam Venkata Ramana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకట రమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Mutyam Venkata Ramana: ఏసీబీ చరిత్రలోనే బిగ్గెస్ట్ రైడ్.. రెడ్కో డీజీఎం వెంకటరమణ అరెస్ట్
Mutyam Venkata Ramana: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరున్నర దశాబ్దాల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైన 'అవినీతి తిమింగలం' చిక్కింది. తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TG REDCO) డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) ముత్యం వెంకటరమణ ఆర్జించిన అక్రమాస్తుల లెక్క చూసి ఏసీబీ అధికారులే దిగ్భ్రాంతి చెందారు. ఇటీవల ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ పేరిట ఉన్న రూ. 17.94 కోట్ల రికార్డును వెంకటరమణ తుడిచిపెట్టేశారు.
బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ మాదాపూర్‌లోని మీనాక్షి స్కైలాంజ్ టవర్స్‌లో ఉన్న ఆయన నివాసంతో పాటు, ఖైరతాబాద్‌లోని రెడ్కో ఆఫీస్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బినామీలు, సన్నిహితుల ఇళ్లు సహా మొత్తం 9 ప్రాంతాల్లో డీఎస్పీ మాజిద్ ఖాన్ నేతృత్వంలోని ఏసీబీ బృందాలు 14 గంటల పాటు విస్తృత సోదాలు నిర్వహించాయి. కాగితాల ప్రకారం రూ. 28.14 కోట్ల ఆస్తులుగా కనిపిస్తున్నప్పటికీ, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 200 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఓ వైపు ప్రభుత్వ అధికారిగా చెలామణి అవుతూనే, మరోవైపు వెంకటరమణ తన భార్య పేరిట నాలుగు కన్స్ట్రక్షన్ కంపెనీలను స్థాపించారు.
ముత్యం కన్స్ట్రక్షన్స్
ముత్యం బిల్డర్స్ & డెవలపర్స్
ముత్యం ఏఎన్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్
ప్రైడ్ హోమ్స్
ఈ సంస్థల ద్వారా కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ఏకంగా 10 అపార్ట్‌మెంట్లను నిర్మించి, భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. సోదాల్లో వెంకటరమణ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, వెంగళరావునగర్‌లోని ఆయన ఆడిటర్ ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేసి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.
వెంకటరమణకు అక్రమార్జన కొత్తేమీ కాదు. 2019 డిసెంబర్ 12న సైబర్ సిటీ సర్కిల్ డీఈగా ఉన్న సమయంలో ఓ కాంట్రాక్ట్ ఫైల్ అప్రూవల్ కోసం రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. నాటి సోదాల్లో రూ. 26.52 లక్షల నగదు, రూ. 22.6 లక్షల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. ఆ కేసు కోర్టులో నడుస్తుండగానే, ఏమాత్రం భయం లేకుండా కోట్ల రూపాయల అక్రమాస్తులను వెనుకేసుకురావడం గమనార్హం.




