TSRTC Strike : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. సర్కార్‌కు షాకిచ్చిన కార్మిక సంఘాలు
TSRTC Strike : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. 30 శాతం ఫిట్‌మెంట్, ఉద్యోగుల విలీనం, మహాలక్ష్మి పథకం నిధుల విడుదల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.
TSRTC
TSRTC Strike : తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు గండం పొంచి ఉంది. ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు మరోసారి పోరాట బాట పట్టారు. శుక్రవారం (మార్చి 13) ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న నేతృత్వంలో కార్మిక సంఘాల నేతలు హైదరాబాద్‌లోని బస్ భవన్‌కు వెళ్లి ఉన్నతాధికారులకు సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే తాము విధిలేని పరిస్థితుల్లో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సమ్మె నోటీసులో కార్మికులు ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు 2021కి సంబంధించిన వేతన సవరణ (PRC)ను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరుతున్నారు. చాలా కాలంగా జీతాల పెంపు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం పీఆర్‌సీ ఊసెత్తకపోవడంపై కార్మిక వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) వల్ల తమపై పనిభారం పెరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన నిధులను ఎటువంటి కోత లేకుండా, ప్రతి నెలా సకాలంలో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పాత బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. పనిభారం పెరగడం వల్ల సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారని, అన్ని కేటగిరీల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
కేవలం ఆర్థికపరమైన డిమాండ్లే కాకుండా, కార్మిక హక్కుల గురించి కూడా జేఏసీ గళమెత్తింది. ట్రేడ్ యూనియన్లపై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, క్రమశిక్షణ చర్యల పేరుతో కార్మికులను వేధించడం ఆపాలని కోరారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె అనివార్యమని జేఏసీ హెచ్చరించింది. ఒకవేళ సమ్మె గనుక జరిగితే సామాన్య ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.




