Yellampally: ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన మంత్రులు కాళేశ్వరంపై సంచలన వ్యాఖ్యలు

Yellampally: మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి సందర్శించి గోదావరి వరదలు, కాళేశ్వరం బ్యారేజీల భద్రతపై కీలక సమీక్ష నిర్వహించారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 1 Aug 2026 11:26 PM IST
Yellampally
X

Yellampally: ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన మంత్రులు కాళేశ్వరంపై సంచలన వ్యాఖ్యలు

ఎల్లంపల్లి: ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

శనివారం అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, 1963లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారని, 1959లో కడెం ప్రాజెక్టుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిందన్నారు. 2004 జూలై 28న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తుండగా, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో మెజారిటీ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టుకు దివంగత శ్రీపాదరావు పేరు పెట్టడం జరిగిందని తెలిపారు.

ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల సాధ్యపడలేదన్నారు.

జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని లిఖితపూర్వకంగా సూచించిందని తెలిపారు. ఇటీవల జరిగిన సాంకేతిక సమావేశంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఎన్‌డీఎస్‌ఏ అధికారులు కూడా నిపుణుల కమిటీ సూచనల మేరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు.

డీపీఆర్ ప్రకారం షీట్‌పైల్ ఫౌండేషన్ నిర్మించాల్సి ఉండగా స్కాంట్ పైల్ ఫౌండేషన్ నిర్మించారని, మూడు బ్యారేజీల పునాదుల నాణ్యతపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. గత రెండు నెలలుగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనల మేరకు మూడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గంట గంటకు నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో పూర్తి చేయలేదని విమర్శించారు.

ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, గత 34 నెలలుగా కాళేశ్వరం మూడు బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎత్తిపోకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించి 340 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించామని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.80 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను సందర్శించి ప్రస్తుత జలస్థితిని పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రకృతి అనుగ్రహంతో మంచి వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండుతున్నాయని, రైతులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తోందన్నారు.

కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి ఎన్‌డీఎస్‌ఏ అనుమతించలేదని, దీనిపై అనవసర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీటి తరలింపు పనులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమేనని, మిడ్ మానేరు, ఫ్లడ్ ఫ్లో కాలువ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించబడినవేనని పేర్కొన్నారు.

కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు నాసిరకంగా నిర్మించడంతోనే దెబ్బతిన్నాయని అన్నారు. గురుత్వాకర్షణ ద్వారా నీరు వచ్చే అవకాశమున్నప్పటికీ భారీ ఎత్తిపోతల ద్వారా వేల కోట్ల రూపాయల విద్యుత్ వ్యయం జరిగేలా ప్రాజెక్టు రూపొందించారని విమర్శించారు. నీటిపారుదల రంగంలో తుగ్లక్ నిర్ణయాలతో లక్షల కోట్ల రూపాయలు వృథా అయ్యాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, గడ్డం వినోద్ కుమార్, వెడ్మ బొజ్జు , మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM

Next Story