Hyderabad: వనస్థలిపురంలో దారుణం: బిడ్డలను చూసేందుకు వస్తే.. భర్తను కొట్టి చంపేసిన భార్య, బావమరిది!

Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఘోరం జరిగింది. కన్నబిడ్డలను చూసేందుకు వచ్చిన భర్త గురు వెంకటేశ్‌పై భార్య, బావమరిది, అతని స్నేహితుడు కలిసి దారుణంగా దాడి చేసి హతమార్చారు.

Arun Chilukuri
Published on: 21 May 2026 7:04 AM IST
Hyderabad
X

Hyderabad: వనస్థలిపురంలో దారుణం: బిడ్డలను చూసేందుకు వస్తే.. భర్తను కొట్టి చంపేసిన భార్య, బావమరిది!

Hyderabad: కన్నపిల్లలను చూసుకోవాలనే ఆరాటంతో వచ్చిన ఓ భర్త.. భార్య, బావమరిది చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన నమ్మలేని ఘోర ఉదంతం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ దాడి, ఆపై మృతదేహాన్ని తరలించేందుకు చేసిన ప్రయత్నం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం హజీపూర్‌కు చెందిన గురు వెంకటేశ్‌ (31), మహబూబ్‌నగర్‌ జిల్లా మల్కాపూర్‌కు చెందిన స్వప్న 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌లో నివాసముంటున్న ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు జన్మించారు. అయితే, వెంకటేశ్‌కు ఉన్న మద్యపాన అలవాటు కారణంగా కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి స్వప్న వనస్థలిపురంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయంలో (7వ అంతస్తు) తన తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది.

గత రెండు రోజులుగా తన పిల్లలను చూడాలంటూ వెంకటేశ్‌ వనస్థలిపురానికి వస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో స్వప్న ఉంటున్న ఫ్లాట్ తలుపులు కొట్టాడు. లోపల ఉన్న స్వప్న, ఆమె సోదరుడు దుబ్బాల పాండు, అతని స్నేహితుడు జగదీశ్‌ తలుపులు తెరిచారు. "నా పిల్లలను ఒకసారి చూపించండి" అని వెంకటేశ్‌ బతిమాలగా.. పాండు, జగదీశ్‌లు ఆగ్రహంతో ఊగిపోయారు. వెంకటేశ్‌ ముఖం, కడుపుపై చేతులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రమైన దెబ్బలకు తాళలేక వెంకటేశ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

వెంకటేశ్‌ స్పృహ కోల్పోవడంతో కంగారుపడిన నిందితులు.. అతడిని 7వ అంతస్తు నుంచి 3వ అంతస్తుకు మెట్ల మార్గంలో ఈడ్చుకుంటూ తీసుకురాసాగారు. సరిగ్గా అదే సమయంలో పైకి వస్తున్న ఓ స్థానిక యువకుడు ఈ తతంగం మొత్తాన్ని తన మొబైల్‌లో వీడియో తీశాడు. అది గమనించిన ముగ్గురు నిందితులు భయంతో వెంకటేశ్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్‌ తెల్లవారే సరికి అక్కడే ప్రాణాలు విడిచాడు.

సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం భార్య స్వప్న, బావమరిది పాండులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, పరారీలో ఉన్న స్నేహితుడు జగదీశ్‌ కోసం గాలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story