Vegetable Prices: కొండెక్కిన కూరగాయ ధరలు..కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!

Vegetable Prices: తెలంగాణలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.

Naresh.k
Published on: 26 Jun 2026 9:35 AM IST
Vegetable Prices
X

Vegetable Prices: కొండెక్కిన కూరగాయ ధరలు..కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!

Vegetable Prices: తెలంగాణలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్‌కు వెళ్తే సంచీ నిండడం దేవుడెరుగు.. జేబు ఖాళీ అయిపోతోందని సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు ఎండల తీవ్రత, తాజాగా వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయల సాగు భారీగా తగ్గిపోయింది. దీంతో మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరుకు లేక ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. ఒకటి రెండు కాదు.. మార్కెట్‌లో ఏ కూరగాయ ముట్టుకున్నా షాక్ కొడుతోంది. బీన్స్, చిక్కుడు, బీరకాయ, పచ్చిమిర్చి, దొండకాయ, వంకాయ ఇలా ఒకటేమిటి.. అన్ని కూరగాయల రేట్లు రెట్టింపు అయ్యాయి. వీటికి తోడు సామాన్యుడికి కాస్త అందుబాటులో ఉండే పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతికూర వంటి ఆకుకూరల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో ధరల పరిస్థితి చూస్తే సామాన్యుడి గుండె గుభేల్ అంటోంది. టమాటా ధర మార్కెట్‌లో అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు పలుకుతోంది. ఇక బీన్స్ విషయానికి వస్తే.. రైతు బజార్‍లోనే కిలో వంద రూపాయలు ఉంటే, బయట రిటైల్ మార్కెట్‌లో ఏకంగా నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయల వరకు అమ్ముతున్నారు. చిక్కుడుకాయ రైతు బజార్‍లో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పలుకుతుండగా, బయట మార్కెట్‌లో నూట యాభై రూపాయలకు చేరింది. నిత్యం వంటల్లో వాడే పచ్చిమిర్చి కిలో ఎనభై రూపాయల నుంచి రిటైల్ మార్కెట్ లో నూట ఇరవై రూపాయల దాకా విక్రయిస్తున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, సాగునీటి వసతి లేకపోవడంతో రైతులు కూరగాయలు పండించేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో లోకల్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఫలితంగా మన రైతుబజార్లలో స్థానిక సరుకు కరువైంది. ఈ కొరతను అధిగమించడానికి వ్యాపారులు మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు.

అలాగే జిల్లాల్లోని చిన్న వ్యాపారులు హైదరాబాద్, కర్నూలు వంటి ప్రాంతాల నుంచి సరుకు తెప్పించుకుంటున్నారు. ఇలా భారీగా ఇతర ప్రాంతాల రవాణాపై ఆధారపడటాన్ని దళారులు ఆసరాగా చేసుకున్నారు. దళారులు రేట్లు పెంచేయడంతో, వారి నుంచి కొనుగోలు చేసే చిన్న వ్యాపారులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వస్తోంది. చివరికి ఈ ధరల భారం అంతా సామాన్య వినియోగదారుడి నెత్తిన పడుతోంది.

గతంలో వంద రూపాయలు పట్టుకెళ్తే సంచీ నిండా కూరగాయలు వచ్చేవి.. కానీ ఇప్పుడు ఐదు వందల నోటు తీసినా కనీసం నాలుగు రకాల కూరగాయలు కూడా రావడం లేదని మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో సామాన్యుడి పళ్లెంలో కూర కనిపించడం కష్టమే అనే ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయా, ధరలు ఎప్పుడు దిగివస్తాయా అని జనం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story