Venkaiah Naidu: యోగా మతానికి సంబంధించినది కాదు.. అలా చూస్తే మూర్ఖత్వమే
Venkaiah Naidu: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగాను ఒక మతానికి పరిమితం చేసి చూడటం మూర్ఖత్వమన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
Venkaiah Naidu: యోగా మతానికి సంబంధించినది కాదు.. అలా చూస్తే మూర్ఖత్వమే
Venkaiah Naidu: యోగా అనేది ఏ ఒక్క మతానికో, వర్గానికో పరిమితం కాదని, దాన్ని మతపరమైన కోణంలో చూడటం కేవలం మూర్ఖత్వం అవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా సమగ్ర మనిషిగా మారతారని పేర్కొన్నారు. "ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత గొప్ప కానుక యోగా. ఇది కేవలం వ్యాయామం కాదు.. సర్వమానవ సౌభ్రాతృత్వానికి, మానవాళి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే అద్భుత సాధనం. మానవ చైతన్యానికి నిదర్శనమైన యోగాను మన పూర్వీకులు ఒక జీవన విధానంగా మలిచి మనకు అందించారు" అని ఆయన కొనియాడారు.
ఆరోగ్య, ఆధ్యాత్మిక, మానసిక ఒత్తిడిని దూరం చేసి, మనిషికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చే శక్తి యోగాకు ఉందన్నారు. ప్రకృతి ఒడిలో ప్రజలు జీవించాలని, ప్రకృతి మాత అందించిన ఈ గొప్ప వరాన్ని ఉపయోగించుకుని 'ఆరోగ్యమే మహాభాగ్యం' అనే మాటను నిజం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రాచీన సంస్కృతిలో భాగమే యోగా: ఎంపీ లక్ష్మణ్
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల్లో యోగా ఒక భాగమన్నారు. ప్రపంచ దేశాలన్నీ నేడు యోగా వైపు చూస్తున్నాయని, నేటి ఆధునిక కాలంలో ఒత్తిడిని అధిగమించడానికి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య, ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తి నిర్మాణంలో యోగా పాత్ర కీలకం: రాంచందర్ రావు
బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో 12 ఏళ్ల క్రితం యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, నేడు ప్రపంచ దేశాలన్నీ యోగాను విస్తృతంగా ఆచరిస్తున్నాయని గుర్తు చేశారు. సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తి నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యోగా ద్వారానే 'ఆరోగ్య భారత్ - స్వాస్త్ భారత్' సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత రోజుల్లో యోగా వల్ల డిప్రెషన్ (మానసిక కుంగుబాటు) పూర్తిగా తొలగిపోతుందని, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి యోగా సాధన చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, యోగా నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు భక్తులు పాల్గొని యోగాసనాలు వేశారు.




