Vikarabad: కాళ్ళపూర్ భూ పోరాటం: 11వ రోజుకు దీక్ష.. రైతులకు సబితా ఇంద్రారెడ్డి మద్దతు!
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్ళపూర్ గ్రామంలో భూ బాధితుల పోరాటం ఉధృతమవుతోంది.
Vikarabad: కాళ్ళపూర్ భూ పోరాటం: 11వ రోజుకు దీక్ష.. రైతులకు సబితా ఇంద్రారెడ్డి మద్దతు!
పరిగి (వికారాబాద్): వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్ళపూర్ గ్రామంలో భూ బాధితుల పోరాటం ఉధృతమవుతోంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా తమ భూములను కోల్పోతున్న రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నేటికి 11వ రోజుకు చేరుకుంది. తమ పొట్ట కొట్టవద్దని, సాగు భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఈ పోరాటానికి రాజకీయ మద్దతు పెరుగుతోంది. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఈరోజు దీక్షా శిబిరాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. "కాళ్ళపూర్, రాపోల్ గ్రామాల్లో భూమి కోల్పోతున్న రైతులకు కేసీఆర్ గారు అండగా ఉంటారని చెప్పారు. మిమ్మల్ని పరామర్శించి, ధైర్యం చెప్పమని ఆయనే పంపారు" అంటూ రైతులకు భరోసా కల్పించారు.
స్వయంగా సబితా ఇంద్రారెడ్డి గారు దీక్షలో కూర్చున్న మహిళా రైతులతో మాట్లాడి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాతిగా పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.భూ బాధితుల పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు, అతి త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళ్ళపూర్ గ్రామానికి వస్తారని ఆమె కీలక ప్రకటన చేశారు.పంటలు పండే భూములను పరిశ్రమల పేరుతో లాక్కోవడం అన్యాయం. తమ భూముల కోసం ప్రాణాలకైనా సిద్ధమని కాళ్ళపూర్ రైతులు తెగేసి చెబుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల మద్దతు తోడవ్వడంతో ఈ భూ సేకరణ వివాదం మరింత వేడెక్కింది. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేస్తుందో లేదో చూడాలి.




