Weather: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈరాత్రికి జాగ్రత్త!

Weather: హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మబ్బులు పట్టి చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

KVD Varma
Published on: 30 March 2026 4:25 PM IST
Weather: హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది
X

Weather

Weather: ఉదయం నుంచి వేడి సెగలు కక్కిన హైదరాబాద్ వాతావరణం సాయంత్రం అయ్యే సరికి పూర్తి రివర్స్ లోకి మారిపోయింది. ఒక్కసారిగా మబ్బులు పట్టి ఆకాశం నల్లగా మారిపోయింది. నగరంలో మూడు గంటల తరువాత చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్,అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. అకస్మాత్తుగా వచ్చిన ఈ వానతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

రాబోయే రెండు గంటలు..

రాబోయే రెండు గంటల పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షం కారణంగా నీరు నిలిచిపోయే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రాత్రికి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా హెచ్చరిస్తోంది.

రాష్ట్ర వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, సోమవారం రాత్రి నగరంలో భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో హైడ్రా (HYDRAA) మరియు జీహెచ్‌ఎంసీ (GHMC) బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయి. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాయి.

హైడ్రా అధికారులు నగర ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. వర్షం పడే సమయంలో పాత భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే అవకాశం ఉన్న చోట నిలబడవద్దని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని కోరారు.

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు నిలిచిన చోట విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సహాయం కోసం జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story