Konda Surekha: 'ప్లాన్-బి'ని సిద్ధం చేసిన కొండా సురేఖ!
Konda Surekha: కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.
Konda Surekha: 'ప్లాన్-బి'ని సిద్ధం చేసిన కొండా సురేఖ!
Konda Surekha: తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా తీవ్ర వేడెక్కింది. వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న సంచలన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంతో ఉమ్మడి వరంగల్ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటే చర్చ.. ఇక కొండా కుటుంబం రాజకీయ భవిష్యత్తు ఏంటి? అనేది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.
కొండా సురేఖ బర్తరఫ్ వార్త బయటకు రాగానే కొండా మురళి మీడియా ముందుకు వచ్చి మీసం తిప్పడం తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. తమ పోరాట పటిమ తగ్గలేదని, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూపిస్తామని ఆయన నర్మగర్భంగా హెచ్చరించారు. వివాదం మొదలైనప్పటి నుంచి వెనక్కి తగ్గని కొండా దంపతులు, అధిష్ఠానం చర్యతో ఏమాత్రం కుంగిపోకుండా ముందుగానే ఒక ‘ప్లాన్-బి’ ని సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లడమే ఆ ప్లాన్-బి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆత్మగౌరవ పోరాటం పేరిట మళ్లీ ప్రజల్లోకి వెళ్లి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే ఆలోచనలో కొండా దంపతులు ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలిటికల్ మనుగడ సాగించాలన్నా, ఉప ఎన్నికల్లో గెలవాలన్నా ఏదో ఒక బలమైన పార్టీ మద్దతు ఖచ్చితంగా అవసరం. మరి ఇప్పుడు కొండా దంపతులకు ఉన్న దారులేంటి..?
బర్తరఫ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం దాదాపు అసాధ్యం. 2018లో గులాబీ పార్టీని వీడే సమయంలో కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో బీఆర్ఎస్ తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్లే. ఇప్పుడు కొండా కుటుంబానికి మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం కమలం పార్టీయే. కొండా దంపతులను ఆహ్వానించేందుకు కేంద్ర బీజేపీ నాయకత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ, స్థానిక నేతల నుంచి కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు టాక్.
ఏది ఏమైనా, కొండా దంపతులు తొందరపడి ఎలాంటి ప్రకటన చేయకూడదని భావిస్తున్నారు. తమ నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులు, కేడర్‌తో సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే పొలిటికల్ ఆఫర్లను బట్టి కొండా కుటుంబం తమ తదుపరి రాజకీయ అడుగులను వేయనుంది. వరంగల్ టైగర్లుగా పేరున్న కొండా దంపతులు ఈ సవాలును ఎలా ఎదుర్కొంటారు..? బీజేపీలో చేరుతారా లేక స్వతంత్రంగానే తొడకొడతారా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.




