Tirupati: జూలై 9 నుంచి 12 వరకు బ్లైండ్ క్రికెట్ సమరం 8 జట్ల హోరాహోరీ!

Tirupati: బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఘనంగా ప్రారంభమైంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 9 July 2026 10:23 PM IST
Tirupati
X

Tirupati: జూలై 9 నుంచి 12 వరకు బ్లైండ్ క్రికెట్ సమరం 8 జట్ల హోరాహోరీ!

తిరుపతి: తిరుపతిలోని గొల్లవాని గుంటలో బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఛైర్మన్ రవి నాయుడు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మీ, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, బ్లైండ్ క్రికెట్ క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ వేదికలపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న గొప్ప క్రీడాకారులని కొనియాడారు. గతంలో బ్లైండ్ క్రికెట్‌కు తగిన గుర్తింపు లేకపోయినా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి, బ్లైండ్ క్రికెట్ సంఘం ప్రతినిధులు రవీంద్రబాబు, శరత్ బాబు తదితరులను అభినందించిన ఆయన, సాధారణ క్రికెటర్లకు ఇచ్చే గౌరవంతోనే బ్లైండ్ క్రికెటర్లను కూడా గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో దివ్యాంగ క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలు, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో తొలిసారిగా క్రీడాకారులకు 3 శాతం స్పోర్ట్స్ రిజర్వేషన్ అమలు చేసినట్లు పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలతో సమానంగా దివ్యాంగ క్రీడాకారులకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రత్యేక సైకిళ్లు, ఇతర ఉపకరణాల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇటీవల దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, "ఇంద్రధనస్సు" వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించినట్లు గుర్తుచేసిన రవి నాయుడు, దాతలు, సంస్థలు, ప్రజాప్రతినిధులు దివ్యాంగ క్రీడాకారులను దత్తత తీసుకుని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

తిరుపతిని దివ్యాంగ క్రీడలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొంటూ, అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అనువుగా స్టేడియం అభివృద్ధి, అదనపు మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు సమకూరుస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో దివ్యాంగ క్రీడాకారుల కోసం ప్రత్యేక స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును చేపట్టేందుకు చర్యలు జరుగుతున్నాయని వెల్లడించారు.

పతకాలు సాధించిన తర్వాత మాత్రమే కాకుండా, ముందుగానే క్రీడాకారులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఇటీవల అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన రాష్ట్ర క్రీడాకారులకు రూ.2.39 కోట్ల ప్రోత్సాహకాన్ని ముందుగానే వారి ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

జూలై 9 నుంచి 12వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 8 పురుషుల జట్లకు చెందిన మొత్తం 118 మంది బ్లైండ్ క్రికెట్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇలాంటి పోటీలు దివ్యాంగ క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకువస్తాయని ఆయన ఆకాంక్షించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story