Sullurpeta: ఏపీ-తమిళనాడు మత్స్యకార వివాదాలపై హైలెవల్ భేటీ
Sullurpeta: ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు జలాల్లో వేట వివాదాల పరిష్కారానికి, 'ఫ్రీ జోన్' ఏర్పాటుపై గుమ్మిడిపూడిలో ఇరు రాష్ట్రాల అధికారులు, ఎమ్మెల్యేలు చర్చించారు.
Sullurpeta: ఏపీ-తమిళనాడు మత్స్యకార వివాదాలపై హైలెవల్ భేటీ
సూళ్ళూరుపేట: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న వేట సంబంధిత సమస్యల శాశ్వత పరిష్కారానికై శనివారం తమిళనాడులోని గుమ్మిడిపూడి ఎండీఓ కార్యాలయంలో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్న ఈ భేటీలో వేట వివాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో పొన్నేరి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఎమ్. ఎస్. రవి, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్. కవిత (IAS), తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు (IAS) పాల్గొన్నారు.
వీటితో పాటు తిరుపతి అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేంద్రరెడ్డి, ఏపీ బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, నాయుడుపేట డీఎస్పీ జీ. చెంచుబాబు, సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ, తడ తహశీల్దార్ కన్నంబాకం రవి కుమార్, సూళ్ళూరుపేట తహశీల్దార్ శైల కుమారి, తడ ఎస్సై కె. కొండప్ప నాయుడు మరియు రెండు రాష్ట్రాల రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖల అధికారులు హాజరయ్యారు.
సముద్రం, పులికాట్ సరస్సు సరిహద్దు జలాల్లో వేట సాగించే సమయంలో తరచూ ఇరు ప్రాంతాల మత్స్యకారుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని మత్స్యకార ప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సమస్యకు శాశ్వత ముగింపు పలకాలంటే ఇరు రాష్ట్రాల సముద్ర మరియు సరస్సు సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించాలని (బౌండరీ ఫిక్స్ చేయాలని) కోరారు. మత్స్యకారుల జీవనోపాధి, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో ప్రత్యేకంగా 'ఫ్రీ జోన్' ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
మత్స్యకార సంఘాలు లేవనెత్తిన వినతులపై అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే చట్టబద్ధమైన పరిష్కారం చూపేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఘర్షణలు జరగకుండా రెండు రాష్ట్రాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తామని, నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, పులికాట్ సరస్సుపై ఆధారపడిన వేలాది మత్స్యకార కుటుంబాల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. మత్స్యకారులు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత వర్గాల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారాన్ని సాధించే వరకు విశ్రమించబోమని భరోసా ఇచ్చారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు రాష్ట్రాల పోలీసు, రెవెన్యూ అధికారులు నిరంతరం సమన్వయంతో ఉండాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సానుకూల స్పందనపై మత్స్యకార నాయకులు హర్షం వ్యక్తం చేశారు.




