Tirupati: వరకట్న వేధింపుల కేసులో భర్తకు 3 ఏళ్ల జైలు శిక్ష!
Tirupati: గాజులమండ్యం పరిధిలో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడు బి.ఉమాపతికి 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరు కోర్టు తీర్పునిచ్చింది.
Tirupati: వరకట్న వేధింపుల కేసులో భర్తకు 3 ఏళ్ల జైలు శిక్ష!
Tirupati: వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరు VI అదనపు జిల్లా జడ్జి శ్రీమతి టి. హరిత సోమవారం తీర్పు వెలువరించారు.
గాజులమండ్యం పోలీస్స్టేషన్లో 2017లో నమోదైన కేసు వివరాల ప్రకారం.. బి.గుణవతి అలియాస్ కోమతి (21) అనే వివాహిత మహిళను వరకట్నం కోసం వేధించి హత్య చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు బి.ఉమాపతి, అతని తల్లి మునెమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాజులమండ్యం పోలీస్స్టేషన్ క్రైం నంబర్ 28/2017గా కేసు నమోదు చేసి, IPC సెక్షన్లు 498-A, 304-Bతో పాటు వరకట్న నిషేధ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో అప్పటి రేణిగుంట డీఎస్పీ కె.ఎస్. నంజుండప్ప ఆధ్వర్యంలో సాక్షులను విచారించి ఆధారాలను సేకరించారు. అనంతరం మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ బి. కాటమరాజు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు పూర్తి చేశారు. అనంతరం చిత్తూరు VI అదనపు జిల్లా జడ్జి కోర్టులో SC No.389/2018గా చార్జిషీట్ దాఖలు చేసి విచారణ కొనసాగించారు.
ఈ కేసులో సోమవారం వెలువడిన తీర్పులో A1 బి.ఉమాపతిపై IPC సెక్షన్ 498-A కింద నేరం రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో అతనికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని ఆదేశించింది.
అయితే A1పై నమోదైన IPC 304-B, వరకట్న నిషేధ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద అభియోగాలు రుజువు కాలేదని కోర్టు నిర్ధారించింది. దీంతో ఆ అభియోగాల నుంచి అతనిని నిర్దోషిగా ప్రకటించింది. మరో నిందితురాలు A2 మునెమ్మ మరణించడంతో ఆమెపై ఉన్న కేసును అబేట్ చేశారు.
కేసు దర్యాప్తు నుంచి కోర్టు విచారణ పూర్తయ్యే వరకు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన గాజులమండ్యం పోలీస్స్టేషన్ అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, సంబంధిత పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.




