Sullurupeta: విద్యార్థులతో కలిసి పంక్తి భోజనం చేసిన సీఐ మురళీకృష్ణ!
Sullurupeta: సీఐ మురళీకృష్ణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి క్యూలైన్‌లో నిలబడి, నేలపై కూర్చుని భోజనం చేసి తన నిరాడంబరతతో అందరి హృదయాలను గెలుచుకున్నారు.
Sullurupeta: విద్యార్థులతో కలిసి పంక్తి భోజనం చేసిన సీఐ మురళీకృష్ణ!
సూళ్ళూరుపేట: శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా సమాజ సేవలోనూ, పర్యావరణ పరిరక్షణలోనూ తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ తనదైన ప్రత్యేక శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు.
పర్యటనలకు వచ్చినప్పుడు ఫొటోలకు మాత్రమే పరిమితమయ్యే అధికారులకు భిన్నంగా, తన నిరాడంబరత, క్రియాశీలక పాత్రతో ఆయన మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలోని మంగళంపాడు మరియు దామానెల్లూరు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో సీఐ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సూళ్ళూరుపేట సెకండ్ ఎస్సై సి. సుబ్రహ్మణ్యంరాజు కూడా పాల్గొన్నారు.
మొక్కలు నాటే కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న సీఐ మురళీకృష్ణ, విద్యార్థులకు పర్యావరణంపై దిశానిర్దేశం చేశారు. పచ్చదనంతో కూడిన వాతావరణం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో అవసరమని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం భోజన సమయం కాగా, సీఐ గారు చూపిన నిరాడంబరత అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హోదాను పక్కనబెట్టి, తోటి అధికారుల కోరిక మేరకు సాధారణ విద్యార్థులతో కలిసి లైన్‌లో నిలబడ్డారు.
చేతిలో ప్లేటు పట్టుకుని స్వయంగా అన్నం పెట్టుకుని విద్యార్థులతో కలసి కింద కూర్చుని భోజనం చేశారు. ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హోదాలో ఉన్న అధికారి తమతో పాటు లైన్‌లో నిలబడి భోజనం చేయడం చూసి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భావోద్వేగానికి, ఆశ్చర్యానికి గురయ్యారు.
సీఐ మురళీకృష్ణ గారు కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుండా, విద్యార్థుల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుంటారు. గతంలో పదవ తరగతి పరీక్షల సమయంలో స్వయంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేసి వారి ఉన్నతికి తోడ్పడ్డారు. అంతేకాకుండా తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకుని తడ, సూళ్ళూరుపేట పరిధిలోని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులకు చల్లని మజ్జిగ, తాగునీటి సదుపాయాలు కల్పించి ప్రజాదరణ పొందారు. ప్రతి సేవా కార్యక్రమంలోనూ ముందుంటూ, విద్యార్థులకు అండగా నిలుస్తున్న సీఐ మురళీకృష్ణ గారి సింప్లిసిటీ మరియు సేవా నిరతిపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




