Renigunta: కలెక్టర్ సంచలన నిర్ణయం: ప్రజావాణి వాయిదా వేసి ఓటర్ సర్వే తనిఖీ!

Renigunta: రేణిగుంటలో కలెక్టర్ కె. వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ. జూలై 14 లోగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) సర్వే పూర్తి చేయాలని ఆదేశం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 13 July 2026 1:27 PM IST
Renigunta
X

Renigunta: కలెక్టర్ సంచలన నిర్ణయం: ప్రజావాణి వాయిదా వేసి ఓటర్ సర్వే తనిఖీ!

Renigunta: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం రేణిగుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఆయన, సర్వే పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఇంటింటి సర్వే నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ, అవసరమైన పత్రాల పరిశీలన వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), బూత్ లెవల్ అధికారులు, పంచాయతీ సిబ్బందితో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈరోజు ఉదయం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని అత్యవసరంగా వాయిదా వేసి, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రేణిగుంటకు వచ్చినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.

సర్వేపై ప్రజల్లో ఎలాంటి అపోహలు, సందేహాలు తలెత్తకుండా విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. కొత్తగా అర్హత పొందిన ఓటర్లను నమోదు చేయడంతో పాటు, చిరునామా మార్పులు, ఇతర సవరణలు కూడా నిబంధనల ప్రకారం చేపట్టాలని తెలిపారు.

రాజకీయ పార్టీల బీఎల్‌ఏలతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అందిన అభ్యంతరాలు, దరఖాస్తులను సకాలంలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

జూలై 14వ తేదీలోపు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్వేను పూర్తిచేసి, నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ తనిఖీలో రెవెన్యూ, పంచాయతీ, ఎన్నికల శాఖల అధికారులు, బూత్ లెవల్ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story