Naidupeta: పాలచూరు వద్ద కలెక్టర్ వేంకటేశ్వర్ ఎమ్మెల్యే విజయశ్రీ క్షేత్రస్థాయి తనిఖీ
Naidupeta: 'జలధార – జలహారతి' పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Naidupeta: పాలచూరు వద్ద కలెక్టర్ వేంకటేశ్వర్ ఎమ్మెల్యే విజయశ్రీ క్షేత్రస్థాయి తనిఖీ
నాయుడుపేట: తిరుపతిజిల్లాలో భూగర్భ జలాల పెంపు, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'జలధార – జలహారతి' కార్యక్రమం పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో కలిసి నాయుడుపేట మండలంలోని పాలచూరు క్యాస్కేడింగ్ సిస్టమ్ వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షపు నీటి ప్రతి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ, చెరువులు, కాలువలు, నీటి వనరులను పునరుద్ధరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పాలచూరు సిస్టమ్‌లో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతానికి అనుసంధానంగా సుమారు 23 కిలోమీటర్ల మేర విస్తరించిన 12 చెరువులు ఉన్నాయని, వీటి ద్వారా సుమారు 6,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు. ఇరిగేషన్ శాఖ పనులను ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ పనులతో అనుసంధానం చేస్తూ సమన్వయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు జలధార – జలహారతి కింద సుమారు 3,360 పనులు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. వీటిలో సప్లై ఛానళ్ల మరమ్మతులు, చెరువుల్లో పూడిక, పొదలు మరియు కలుపు మొక్కల తొలగింపు, క్యాస్కేడింగ్ సిస్టమ్స్ అనుసంధానం, అలుగుల మరమ్మతులు వంటి పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సూళ్లూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఈ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమం ద్వారా చెరువులు నిండటంతో భూగర్భ జలమట్టాలు పెరగడమే కాకుండా, ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని, పశుసంపదకు నీటి లభ్యత పెరిగి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కలెక్టర్ వివరించారు.
రానున్న కాలంలో ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, ముందస్తు చర్యగా నీటి వనరులను సంరక్షించుకోవాలని సూచించారు. అనంతరం నాయుడుపేట – వెంకటగిరి విసిఐసి రోడ్డు పనులను పరిశీలించి, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి మద్దిలేటి, ఇరిగేషన్ ఎస్ఈ రాధాకృష్ణ, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.




