Puttur: పుత్తూరు ఇళ్ల స్థలాల కోసం పేదల భూ పోరాటం

Puttur: పుత్తూరులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆందోళన చేపట్టిన సీపీఐ, సీపీఎం నాయకులు. అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్. అధికారుల హామీతో తాత్కాలిక విరమణ.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 10 July 2026 5:35 PM IST
Puttur
X

Puttur: పుత్తూరు ఇళ్ల స్థలాల కోసం పేదల భూ పోరాటం

పుత్తూరు: ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో పుత్తూరులో శుక్రవారం భూ పోరాటం చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి నాయకత్వంలో వందలాది మంది పేదలు ఆర్‌సీ గేటు నుంచి ర్యాలీగా బయలుదేరి, నందిమంగలం గ్రామ పరిధిలోని సర్వే నంబర్-6లో ఉన్న సుమారు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పి. మురళి మాట్లాడుతూ, ప్రభుత్వ భూమిని కొందరు భూకబ్జాదారులు ఆక్రమించి మామిడి తోటలు, ప్రహరీ గోడలు నిర్మించుకున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అయితే పేదలు ప్రభుత్వ భూమిలోకి వెళ్లగానే అధికారులు స్పందించడం విచారకరమన్నారు.

ఎన్నికల సమయంలో కూటమి నాయకులు, అంతకుముందు వివిధ ప్రభుత్వాలు ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ప్రభుత్వ భూమిని విడిచి వెళ్లబోమని, అవసరమైతే అక్కడే నిరవధికంగా ఆందోళన కొనసాగిస్తామని పేదలు ప్రకటించారు. అనంతరం అక్కడికి చేరుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, తహసీల్దార్ తరఫున నాయకులతో చర్చించి త్వరలో సర్వే నిర్వహించి అర్హులను గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన తాత్కాలికంగా విరమించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, సీపీఎం పుత్తూరు పట్టణ కార్యదర్శి వెంకటేష్, సీపీఐ పుత్తూరు ప్రాంత కార్యదర్శి మహేష్‌తో పాటు సీపీఐ, సీపీఎం నాయకులు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్, పంచాయతీ కార్మికులు, హమాలీలు, వీధి వ్యాపారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే మరో రెండు నెలల తర్వాత ఇదే భూమిలో గుడిసెలు వేసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వామపక్ష నాయకులు హెచ్చరించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story