Sullurupeta: సామాన్యులపై నిత్యావసరాల భారం: కేంద్ర ప్రభుత్వపై సీపీఐ ఆగ్రహం

Sullurupeta: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపునిచ్చారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 9 Aug 2026 6:27 PM IST
Sullurupeta
X

Sullurupeta: సామాన్యులపై నిత్యావసరాల భారం: కేంద్ర ప్రభుత్వపై సీపీఐ ఆగ్రహం

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మున్సిపల్ పరిధిలోని వట్రపాలెం ప్రాంతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి ముఖ్య అతిథిగా విచ్చేసి, వీధివీధినా తిరిగి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

​ఈ సందర్భంగా పి. మురళి మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వ విధానాల కారణంగా సామాన్య ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు. ధరల పెరుగుదలను అరికట్టడంతో పాటు ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

​సూళ్ళూరుపేటలోని వట్రపాలెం వాసులు ఎదుర్కొంటున్న తీవ్ర తాగునీటి సమస్యతో పాటు, కాలంగి నది నీటి ముంపు ముప్పు గురించి ఆయన ప్రత్యేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. నది తూములను పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం వల్ల రాబోయే వర్షాకాలంలో దాదాపు వెయ్యి కుటుంబాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, అధికారులు తక్షణమే ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.

​ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బ్యాలెట్ పేపర్ పద్ధతిని పునరుద్ధరించాలని, మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, దళితులు, ఆదివాసీలపై అకృత్యాల అణచివేతకై ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు, 17 నుంచి 28 వరకు ప్రచార ఆందోళనలు నిర్వహిస్తున్నామని, ఈ పోరాటాన్ని ఉధృతం చేసి సెప్టెంబర్ 1న 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

​ఈ పాదయాత్రలో సూళ్ళూరుపేట నియోజకవర్గ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు శీను, నాగేంద్ర, నగర కార్యదర్శి ఆనంద్, రూరల్ మండల కార్యదర్శి రమణయ్య, మహిళా సమైక్య నాయకులు చెంచమ్మ, లక్ష్మి, బాలయ్య, ప్రభుదాసు, ప్రసాద్, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ బాలసుబ్రమణ్యం, ఆటో యూనియన్ నాయకులు బాబు, నాగరాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story