Yerpedu: ఏర్పేడులో 'క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్' ప్రారంభం!

Yerpedu: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మాధవమాలలో 'క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్' కేంద్రం ప్రారంభం. చెక్క కళాకారులకు నాణ్యమైన కలప అందించడమే లక్ష్యం.

JALEEL, NAGARI & RENIGUNTA
Updated on: 15 Aug 2026 5:17 PM IST
Yerpedu
X

Yerpedu: ఏర్పేడులో 'క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్' ప్రారంభం!

Yerpedu: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మాధవమాల పంచాయతీలో ‘క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్’ కేంద్రాన్ని ప్రారంభించారు. అధికారులతో కలిసి కేంద్రాన్ని ప్రారంభించిన స్థానిక ప్రజాప్రతినిధి, చెక్క కళాకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

చేతివృత్తుల కళాకారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ వుడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ప్రారంభించగా, ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా వీక్షించినట్లు చెప్పారు.

మాధవమాల గ్రామంలో తరతరాలుగా సంప్రదాయ చెక్క బొమ్మలు, కళాకృతులను తయారు చేస్తున్న కళాకారులకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. అయితే ముడిసరుకు కొరత కారణంగా కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నాణ్యమైన కలపను అసలు ధరకే అందించేందుకు క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ దోహదపడుతుందని పేర్కొన్నారు.

స్థానిక కళాకారులతో మాట్లాడి ముడిసరుకు, మార్కెటింగ్, ఆర్థిక సహకారానికి సంబంధించిన సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు. మాధవమాల చెక్క కళకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే సంప్రదాయ చెక్క కళ అంతరించిపోకుండా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. కొత్త తరానికి ఈ నైపుణ్యాలను అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతామని చెప్పారు. సంప్రదాయ చేతివృత్తులను కాపాడుతూ మాధవమాల కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story