Renigunta: రేణిగుంటలో విద్యాసంస్థల బంద్ జయప్రదం!

Renigunta: నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీ విద్యార్థులపై పోలీసు దాడికి నిరసనగా రేణిగుంటలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 24 July 2026 11:02 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో విద్యాసంస్థల బంద్ జయప్రదం!

Renigunta: ఢిల్లీలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నిరసనగా విద్యార్థులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా వామపక్ష ప్రజాసంఘాల పిలుపు మేరకు శుక్రవారం రేణిగుంట మండలంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు రాజశేఖర్, ఐద్వా మండల కార్యదర్శి కొండ్రెడ్డి ఈశ్వరమ్మ, నాయకులు సత్యశ్రీ తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో పలుమార్లు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగినప్పటికీ బాధ్యత వహించకుండా పదవిలో కొనసాగడం సరికాదన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

అలాగే ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసు చర్యలను ఖండిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బంద్‌కు రేణిగుంట మండలంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సహకరించి సెలవు ప్రకటించాయని, వారికి వామపక్ష ప్రజాసంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రేణిగుంట బాయ్స్ హైస్కూల్, మంచినీళ్లగుంట ఉర్దూ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, కరకంబాడి హైస్కూల్, తారకరామనగర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల వద్ద బంద్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు రాజశేఖర్, ఐద్వా నాయకులు ఈశ్వరమ్మ, సత్యశ్రీ, భారతి, గీత, సుజాతమ్మ, ఆటో యూనియన్ నాయకురాలు దీప, బిల్డింగ్ యూనియన్ నాయకులు అశోక్, శివానందం, గిరిజన సంఘం నాయకుడు మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story