Srikalahasti: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలి!
Srikalahasti: మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సీపీఐ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపునిచ్చారు.
Srikalahasti: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలి!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు సీపీఐ నియోజకవర్గ సమితి సమావేశం వై.ఎస్. మణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి. మురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పి. మురళి మాట్లాడుతూ, రానున్న మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, వాటి పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
శ్రీకాళహస్తి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, మురుగునీటి కాలువల సమస్యలు, వీధిలైట్ల నిర్వహణ వంటి అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, మెరుగైన పారిశుద్ధ్యం, రహదారులు, వీధిలైట్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధిలైట్ల సమస్యలను పరిష్కరించి గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్థానిక సంస్థలు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణాలు, గ్రామాల అభివృద్ధి, పేద ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా సీపీఐ నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల్లో ప్రజల గొంతుకగా నిలిచి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సీపీఐ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచి మద్దతు ఇవ్వాలని పి. మురళి కోరారు.
ఈ సమావేశంలో సీపీఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య మండల కార్యదర్శులు వై.ఎస్. మణి, సి.హెచ్. శివ, రూరల్ మండల కార్యదర్శి ఎం. శివకుమార్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి తొండు మల్లికార్జున, మనీ, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.




