Srikalahasti: అక్కుర్తి రైల్వే గేటు వద్ద గంజాయి పట్టివేత: ఒకరు అరెస్ట్
Srikalahasti: శ్రీకాళహస్తి అక్కుర్తి రైల్వే గేటు వద్ద రూరల్ సీఐ ఇబ్రహీం ఆధ్వర్యంలో 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని, మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
Srikalahasti: అక్కుర్తి రైల్వే గేటు వద్ద గంజాయి పట్టివేత: ఒకరు అరెస్ట్
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. నవంబర్ 11వ తేదీ ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి రైల్వే గేటు వద్ద గంజాయి అక్రమ విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో రూరల్ సీఐ జి. ఇబ్రహీం తన సిబ్బంది, రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ముచ్చువోలు గ్రామానికి చెందిన బర్రి మోహన్ రెడ్డి, తండ్రి మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 1,100 గ్రాముల గంజాయి, ఒక సెల్ఫోన్, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో ఒడిశా రాష్ట్రంలోని ఛత్రపూర్ పట్టణానికి చెందిన శీను అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్లో NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన వ్యక్తితో పాటు ఈ అక్రమ వ్యాపారంలో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రజలకు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు తెలియజేయాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.




