Tirupati: శ్రీసిటీని సందర్శించిన జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్!

Tirupati: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీని చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ సందర్శించారు.

K. SURESH BABU, SATYAVEDU
Published on: 12 Aug 2026 11:52 PM IST
Tirupati
X

Tirupati: శ్రీసిటీని సందర్శించిన జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్!

తిరుపతి: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ చెన్నైలోని జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆర్.శివశంకర్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.

కాన్సుల్ జనరల్ తో చర్చల సందర్భంగా శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. ప్రపంచ స్థాయి మౌళిక వసతులతో శ్రీసిటీ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అనువైన వేదికగా ఎదిగిందన్నారు. బెల్ ఫ్లేవర్స్ & ఫ్రాగ్రెన్సెస్, నాఫ్, కాంక్యో బెర్ట్ వంటి జర్మన్ కంపెనీలు ఇప్పటికే శ్రీసిటీలో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. జర్మనీ నుంచి మరిన్ని పెట్టుబడులకు ఈ పర్యటన దోహదపడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

శ్రీసిటీ సమగ్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ ద్వారా ఒనగూరే వివిధ ప్రయోజనాలను కాన్సుల్ జనరల్ కు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పన్ను రాయితీలు, సబ్సిడీలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘3S’ విధానం వేగం (Speed), స్థిరత్వం (Stability), సేవలు (Service) ద్వారా ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలోనే అత్యంత ప్రాధాన్యమైన పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దబడుతున్నట్లు వివరించారు. ఇంకా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

శ్రీసిటీ ప్రణాళిక, ఆధునిక మౌళిక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని మైఖేల్ హాస్పర్ ప్రశంసించారు. శ్రీసిటీ ఒక ప్రపంచస్థాయి పారిశ్రామిక నమూనాగా అభివర్ణించారు. జర్మనీకి భారత్ కీలక వాణిజ్య భాగస్వామిగా పేర్కొన్న ఆయన, భారతదేశంలో విస్తరిస్తున్న మార్కెట్, పెట్టుబడి అనుకూల ప్రభుత్వ విధానాలు ఇరు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సహకారానికి అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు. తయారీ రంగానికే పరిమితం కాకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లోనూ భారత్–జర్మనీ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని హాస్పర్ పేర్కొన్నారు. ముఖ్యంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, విద్యా సంస్థలు–పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

తన పర్యటనలో భాగంగా కాన్సుల్ జనరల్ శ్రీసిటీలోని పలు కీలక సదుపాయాలను సందర్శించారు. జర్మనీకి చెందిన నాఫ్ (Knauf) పరిశ్రమను సందర్శించి, అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు, ఇతర అంశాలను ఆయన పరిశీలించారు. ఈ పర్యటన భారత్–జర్మనీ మధ్య వ్యాపార, పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగుగా నిలవడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రముఖ గమ్యస్థానంగా శ్రీసిటీని మరింత బలోపేతం చేయనుంది.

K. SURESH BABU, SATYAVEDU

K. SURESH BABU, SATYAVEDU

Next Story