Sullurpeta: రేపే GSLV-F18 ప్రయోగం: ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు

Sullurpeta: శ్రీహరికోట నుంచి రేపు అర్ధరాత్రి GSLV-F18 ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది; సూళ్ళూరుపేట చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు చేశారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 29 Oct 2026 4:18 PM IST
Sullurpeta
X

Sullurpeta: రేపే GSLV-F18 ప్రయోగం: ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు

తిరుపతి జిల్లా: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మరో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది! జియో సింక్రనస్ లాంచింగ్ వెహికిల్ GSLV-F18 రాకెట్ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన NVS-03 ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. నావిగేషన్ వ్యవస్థలో ఇది ఐదవ కీలక ఉపగ్రహం కావడం విశేషం.

​ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. GSLV-F18 రాకెట్ నమూనాతో అమ్మవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు.

​ఈ సందర్భంగా మాట్లాడిన ఇస్రో చైర్మన్.. ఇవాళ అర్ధరాత్రి 11:51 గంటలకు సరిగ్గా 24 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని, రేపు అర్ధరాత్రి 11:51 గంటలకు నింగిలోకి రాకెట్ దూసుకెళ్తుందని వెల్లడించారు. అంతేకాకుండా, ఈ ప్రయోగం పూర్తయిన మరికొద్ది రోజుల వ్యవధిలోనే గగన్‌యాన్ D1 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రైవేటు లాంచింగ్‌లకు ప్రాధాన్యత ఇస్తూ, వేగవంతంగా ప్రయోగాలు చేసేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు.

​మరోవైపు, ఈ ప్రయోగాన్ని తిలకించేందుకు విదేశీ శాస్త్రవేత్తల బృందం ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకుంది. ప్రయోగం నేపథ్యంలో షార్ పరిసర ప్రాంతాల్లో సీఐఎస్‌ఎఫ్‌ (CISF) బలగాలు భూమి, ఉపరితలం మరియు సముద్ర తీర ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలు చేపట్టాయి. సాధారణ వ్యక్తుల ప్రవేశాన్ని షార్ ప్రాంగణంలోకి పూర్తిగా నిషేధించారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta