Tirupati: గూడూరులో అంగరంగ వైభవంగా జెండా పండుగ!

Tirupati: తిరుపతి జిల్లా గూడూరులో 75 ఏళ్ల చరిత్రాత్మక ఆంజనేయ స్వామి జెండా పండుగ మహాలయ అమావాస్య రోజున అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Oct 2026 4:01 PM IST
Tirupati
X

Tirupati: గూడూరులో అంగరంగ వైభవంగా జెండా పండుగ!

Tirupati: నెల్లూరు జిల్లా గూడూరు అంటేనే జెండా పండుగ గుర్తుకు వస్తుంది. దసరా ఉత్సవాలు అనగానే మైసూరు ఎంత ఫేమసో, గూడూరులో జరిగే ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి అంతే ప్రాధాన్యత ఉంది. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ జెండా పండుగకు 75 ఏళ్ల చరిత్ర ఉంది.

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో దసరా ఉత్సవాలు అంటేనే జెండా పండుగ. విజయదశమికి పది రోజుల ముందు వచ్చే మహాలయ అమావాస్య రోజున ఈ జెండా ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

సుమారు 1948లో గూడూరులో ఈ జెండా ఉత్సవానికి తెరతీశారు. అప్పట్లో గూడూరు ప్రాంతంలో తీవ్ర కరవు కాటకాలు, అంటువ్యాధులు, కలరా వంటి వ్యాధులు ప్రబలాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని పెద్దలు చెబుతారు. ఈ కష్టాల నుండి గట్టెక్కించాలని, గ్రామాన్ని కాపాడాలని ఆంజనేయ స్వామిని వేడుకుంటూ అప్పటి పెద్దలు ఈ జెండా పండుగను ప్రారంభించారు.ఆనాటి నుండి నేటి వరకు ఈ పండుగ గూడూరు ప్రజల విశ్వాసానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. జెండాను ఎగురవేయడం ద్వారా చెడు తొలగిపోయి, మంచి జరుగుతుందని, పంటలు బాగా పండుతాయని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడి ప్రజల నమ్మకం.మహాలయ అమావాస్య రోజున గూడూరులోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ జెండాను ప్రతిష్టిస్తారు. ఈ జెండాను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. జెండా ప్రతిష్టతోనే దసరా ఉత్సవాలు మొదలైనట్లుగా భావిస్తారు.

ఆ తర్వాత 10 రోజుల పాటు గూడూరు పట్టణం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు, ప్రభలు, అంగరంగ వైభవంగా జరుగుతాయి. విజయదశమి రోజున జెండాను దించడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

అందుకే గూడూరు జెండా పండుగ అంటే కేవలం ఒక పండుగ కాదు ... అది గూడూరు ప్రజల నమ్మకం, ఆచారం, వారసత్వం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్