Sullurpeta: కాళంగి వారధిపై భారీ వాహనాల రాకపోకలపై నిషేధం..సీఐ మురళీకృష్ణ!

Sullurpeta: సూళ్ళూరుపేటలోని కాళంగి వారధిపై భారీ వాహనాల రాకపోకలపై సీఐ ఎం. మురళీకృష్ణ పూర్తిస్థాయి నిషేధం విధించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 12 Nov 2026 11:55 AM IST
Sullurpeta
X

Sullurpeta: కాళంగి వారధిపై భారీ వాహనాల రాకపోకలపై నిషేధం..సీఐ మురళీకృష్ణ!

Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని కాళంగి వారధి (బ్రిడ్జి) మీదుగా భారీ వాహనాల రాకపోకలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నామని, నిబంధనలు అతిక్రమించి రోడ్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ గట్టిగా హెచ్చరించారు.

గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ ట్రాఫిక్ నియంత్రణపై తనదైన శైలిలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

​గురువారం (12-11-2026) ఉదయం 10 గంటల నుంచే కాళంగి బ్రిడ్జిపైకి ఏ ఒక్క భారీ వాహనాన్ని అనుమతించేది లేదని సీఐ తెగేసి చెప్పారు. నెల్లూరు, వెంకటగిరి తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికులతో చెన్నై వైపు రాకపోకలు సాగించే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ఇకపై బస్టాండ్ నుంచి నేరుగా హోలీ క్రాస్ సర్కిల్ మీదుగా చెన్నై వెళ్లాలని, అదేవిధంగా చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వచ్చే బస్సులు కూడా హోలీ క్రాస్ సర్కిల్ మీదుగానే సూళ్ళూరుపేట పట్టణంలోకి ప్రవేశించాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ మళ్లింపు నిబంధనలు కేవలం ప్రయాణికుల బస్సులకే కాకుండా, వివిధ పరిశ్రమలకు ఉద్యోగులను తీసుకెళ్లే కంపెనీ బస్సుల యజమానులకు కూడా తూచా తప్పకుండా వర్తిస్తాయని ఆయన హెచ్చరించారు.

ముఖ్యంగా సూళ్ళూరుపేట పట్టణంలో ఉద్యోగులను ఎక్కించుకునే స్టాఫ్ బస్సులు శ్రీనగర్ కాలనీ లేదా శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో 'యు-టర్న్' తీసుకుని హోలీ క్రాస్ సర్కిల్ మీదుగా మాత్రమే ప్రయాణించాలని, దారి మళ్లిస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.

​మరోవైపు, జీఎన్‌టీ (GNT) ప్రధాన రహదారిపై భారీ వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నామని ప్రకటించిన సీఐ, రోడ్డుపై ఎక్కడైనా వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే తక్షణమే రూ. 1,500 భారీ జరిమానా విధిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా, జీఎన్‌టీ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలకు పాల్పడి ట్రాఫిక్‌కు అడ్డుగా మారిన వారిపై ఉక్కుపాదం మోపనున్నామని, మున్సిపాలిటీ అధికారుల సహకారంతో ఆ ఆక్రమణలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని స్పష్టం చేశారు.

ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసమే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, వాహనదారులు, ఆటో, బస్సు డ్రైవర్లు పోలీసులకు సహకరించి నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఐ మురళీకృష్ణ హెచ్చరించారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta