Sullurpeta: నాగబాబుకు కేబినెట్ హోదాపై జనసేన హర్షాతిరేకాలు!
Sullurpeta: ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఏపీ గ్రీన్ చైర్మన్‌గా కేబినెట్ హోదా దక్కడంపై సూళ్ళూరుపేటలో జనసేన నేత షేక్ మాబాష ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
Sullurpeta: నాగబాబుకు కేబినెట్ హోదాపై జనసేన హర్షాతిరేకాలు!
సూళ్ళూరుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించి, క్యాబినెట్ హోదా కల్పించడం పట్ల తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు పండగ వాతావరణంలో ఘనంగా సంబరాలు నిర్వహించాయి. స్థానిక జనసేన ప్రముఖ నాయకుడు షేక్ మాబాష ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఒకే చోటకు చేరి కేక్ కట్ చేయడంతో పాటు పరస్పరం స్వీట్లను పంపిణీ చేసుకున్నారు. అనంతరం బాణాసంచా కాల్చి, “పవన్ కళ్యాణ్ జిందాబాద్”, “నాగబాబు జిందాబాద్” అనే నినాదాలతో సూళ్ళూరుపేట పట్టణ వీధులను హోరెత్తించారు.
ఈ కార్యక్రమంలో షేక్ మాబాష ప్రసంగిస్తూ ప్రత్యర్థుల విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో పార్టీ నుండి ఒకరిద్దరు నాయకులు వెళ్లినంత మాత్రాన జనసేన ఉనికి లేదనడం పూర్తిగా హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. రాజకీయాలో నాయకులు పార్టీలు మారడం అనేది చాలా సాధారణమైన ప్రక్రియ అని, ఎవరో ఒక్కరు వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో జనసేన జెండా ఎప్పుడూ సగర్వంగా ఎగురుతూనే ఉంటుందని, కార్యకర్తల ఉత్సాహంతో జరుగుతున్న ఈ కార్యక్రమమే పార్టీ ఎంత బలంగా ఉందో చెప్పడానికి సజీవ ఉదాహరణ అని అన్నారు.
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి తామంతా ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటామని, పార్టీ అభివృద్ధి కోసం గతంలో కంటే మరింత కష్టపడి పనిచేస్తామని మాబాష ఉద్ఘాటించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందనడానికి నాగబాబుకు లభించిన ఈ పదవే నిదర్శనమని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లా అభివృద్ధిలోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ జనసేన ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, నక్క హరిబాబు, వల్లూరు రాజా, కయ్యాల కోటయ్య యాదవ్, ఆవుల దాసు,ఏంబేటి ప్రవీణ్, రెడతోట్టి జనార్ధన్, శెట్టిపల్లి యశ్వంత్, మధుసూదన్ రావు, రామ్మూర్తి, చిరంజీవి, నరేష్, వీరమహిళలు సుజాత ,పద్మజ, తడ మండలం, దొరవారి సత్రం మండలం, నాయుడుపేట, మండలం నాయకులు మరియు జనసేన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.




