Sullurpeta: సూళ్ళూరుపేటలో 'సర్' కార్యక్రమం.. కేడర్‌కు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే!
Sullurpeta: సూళ్ళూరుపేటలో ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది.
Sullurpeta: సూళ్ళూరుపేటలో 'సర్' కార్యక్రమం.. కేడర్‌కు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే!
తిరుపతి జిల్లా: సూళ్ళూరుపేట పట్టణంలోని సత్యసాయి కల్యాణ మండపంలో దొరవారిసత్రం, తడ,సూళ్ళూరుపేట మండలాల నాయకులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ, నియోజకవర్గ పరిశీలకులు మద్దిపట్ల సూర్యప్రకాష్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. 'సర్' (SIR) ప్రోగ్రామ్, కూటమి రెండేళ్ల పాలన-ఇంటింటి ప్రచారంపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేడా. నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పార్టీ ముందు ప్రస్తుతం రెండు ప్రధాన కార్యక్రమాలు ఉన్నాయని.. ఒకటి 'సర్' (SIR) ప్రోగ్రామ్, రెండవది ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోయే 'ఇంటింటికీ ప్రచారం' అని తెలిపారు. గత మున్సిపాలిటీ పాలనలో నాయుడుపేట, సూళ్ళూరుపేటలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.
త్వరలోనే డ్రైనేజీ ప్రతిపాదనలు కూడా తీసుకువస్తామన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు.పార్టీ బలోపేతం కోసం ప్రతి మండలాన్ని విడివిడిగా సమీక్షించి, సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎక్కడైనా కేడర్ వీక్‌గా ఉంటే సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, పదవుల గురించి కాకుండా తెలుగుదేశం కుటుంబ సభ్యుల్లా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
2002 తర్వాత మళ్లీ 2026 లోనే ఈ 'సర్' కార్యక్రమం జరుగుతోందని, జూలై 14తో ముగిసే ఈ లోపు ఓటర్ల జాబితాను పక్కాగా గమనించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) పై ఉందన్నారు. వైసీపీ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా స్ట్రాంగ్‌గా ఉండాలని, ఆసక్తి లేని బిఎల్ఏల స్థానంలో ఇతరులను మార్చుకుందామని సూచించారు.
సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు మద్దిపట్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు. ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విపక్షాలు మహిళలను అడ్డం పెట్టుకుని ఇసుక, మట్టి దోపిడీ జరుగుతోందంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని కేడర్‌కు సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలవడం, 2029లో మళ్లీ నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమే అందరి ఏకైక లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట పట్టణ అధ్యక్షుడు, ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, సీనియర్ నాయకుడు తిరుమూరు సుధాకర్ రెడ్డి, టీడీపీ నాయకుడు మాధవ్ నాయుడు, ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ ఏజీ కిషోర్, తడ మండలం అధ్యక్షుడు సెల్వం మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.




