Satyavedu: భీముని చెరువు పాఠశాల అభివృద్ధికి కేజేఆర్ ట్రస్ట్ ఉదారత!

Satyavedu: తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలోని భీముని చెరువు జడ్పీ పాఠశాల అభివృద్ధికి కేజేఆర్ ట్రస్ట్ అందించిన సహకారాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం అభినందించారు.

K. SURESH BABU, SATYAVEDU
Published on: 10 Sept 2026 4:46 PM IST
Satyavedu
X

Satyavedu: భీముని చెరువు పాఠశాల అభివృద్ధికి కేజేఆర్ ట్రస్ట్ ఉదారత!

Satyavedu: విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదువుతూ, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. నారాయణవనం మండలం భీముని చెరువు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ.. తాను ఇదే పాఠశాలలో పూరిగుడిసెలో నేలపై కూర్చొని చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. నాటి పరిస్థితులతో పోలిస్తే నేడు పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అభివృద్ధి చెందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులతో పాటు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, మంచి నడవడికను అలవర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

పాఠశాల అభివృద్ధికి మరింత సహకారం జడ్పీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ మాట్లాడుతూ తాను కూడా ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశానని, తాను చదువుకున్న పాఠశాలకు సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటికే పాఠశాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో దాతల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

సంక్రాంతిలోపు అంబేద్కర్ విగ్రహం

భీముని చెరువు గ్రామ యువత కోరిక మేరకు వచ్చే జనవరి సంక్రాంతి పండుగలోపు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కోనేటి సుమన్ కుమార్ ప్రకటించారు. ఈ ప్రకటనతో గ్రామ యువత హర్షం వ్యక్తం చేసింది.

కేజేఆర్ ట్రస్ట్ సేవలకు అభినందనలు

పాఠశాల అభివృద్ధికి అవసరమైన సామగ్రిని అందించిన కేజేఆర్ ట్రస్ట్ చైర్మన్ సురేష్ రెడ్డి, ఆయన బృందాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, కోనేటి సుమన్ కుమార్‌లు దుశ్శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల అభివృద్ధికి కేజేఆర్ ట్రస్ట్ ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ గ్రామానికి, పాఠశాలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని ట్రస్ట్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో నారాయణవనం మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, విద్యావంతులు, యువకులు, మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

K. SURESH BABU, SATYAVEDU

K. SURESH BABU, SATYAVEDU