Sullurpeta: ఎకనామిక్ రీజియన్ సదస్సులో ఎమ్మెల్యే విజయశ్రీ ప్రతిపాదనలు!
Sullurpeta: తిరుపతి ఎకనామిక్ రీజియన్ సదస్సులో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ సెజ్‌లు, టూరిజం అభివృద్ధిపై విప్లవాత్మక ప్రతిపాదనలు చేశారు.
Sullurpeta: ఎకనామిక్ రీజియన్ సదస్సులో ఎమ్మెల్యే విజయశ్రీ ప్రతిపాదనలు!
Sullurpeta: స్వర్ణాంధ్ర @ 2047’ విజన్‌లో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్లో నిర్వహించిన ‘తిరుపతి ఎకనామిక్ రీజియన్ (టీఈఆర్)’ భాగస్వామ్యుల సదస్సులో సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ, రెవెన్యూ-ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా (ఐఏఎస్) అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఉమ్మడి జిల్లాల సమగ్ర ఆర్థికాభివృద్ధిపై నిర్వహించిన చర్చలో ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ నియోజకవర్గ ప్రగతికి సంబందించిన పలు విప్లవాత్మక ప్రతిపాదనలు చేసి అధికారుల ప్రశంసలు అందుకున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే విజయశ్రీ స్పష్టం చేశారు.
నియోజకవర్గ పరిధిలోని మాంబట్టు, మేనకూరు సెజ్ (SEZ)లలో భారీగా నూతన పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఆయా సెజ్‌లలో మౌలిక వసతులను సమూలంగా మెరుగుపరచడంతో పాటు, స్థానిక నిరుద్యోగ యువతకు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్య శిక్షణ (Skill Development) ఇప్పించి, స్థానికులకే అత్యధిక ఉద్యోగావకాశాలు దక్కేలా చొరవ చూపాలని అధికారులకు గట్టిగా దిశానిర్దేశం చేశారు.
పర్యాటక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేలా పులికాట్ సరస్సు మధ్యలో ఉన్న ‘ఇరుకం ఐలాండ్’ అభివృద్ధిపై ఎమ్మెల్యే విజయశ్రీ ప్రత్యేక దృష్టి సారించారు. అత్యాధునిక బోటింగ్, రవాణా సౌకర్యాలు మరియు పర్యాటక మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఇరుకం ఐలాండ్‌ను అంతర్జాతీయ స్థాయి ఎకో-టూరిజం హబ్‌గా రూపాంతరం చెందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా, పోర్టులు, జాతీయ రహదారులకు అత్యంత సమీపంలో ఉన్న సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాలను కలుపుతూ ప్రధాన లాజిస్టిక్స్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. నియోజకవర్గ రూపురేఖలు మార్చేలా ఎమ్మెల్యే ప్రతిపాదించిన ఈ ప్రణాళికలపై సదస్సులో పాల్గొన్న ప్లానింగ్ విభాగం జాయింట్ సెక్రటరీ అనంత్ శంకర్, జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు.




