Sullurupeta: పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది!
Sullurupeta: సుళ్ళూరుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ. ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ, కమిషనర్ చిన్నయ్య పాల్గొన్నారు.
Sullurupeta: పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది!
Sullurupeta: తిరుపతజిల్లా సుళ్ళూరుపేట పట్టణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సుళ్ళూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం కార్మికులకు 4 లీటర్ల 200 గ్రాముల వంట నూనె, నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 సోపులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా పట్టణ పరిశుభ్రత కోసం వారు పడుతున్న శ్రమను గుర్తించి గౌరవించడం మన బాధ్యతని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కేవలం నిత్యావసరాలే కాకుండా, ప్రతివారం కార్మికులను సన్మానించడం, పని ప్రదేశాల్లో రక్షణ కోసం గ్లౌజులు, మాస్కులు అందించడం, ప్రత్యేక సందర్భాల్లో దుస్తులు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపడుతున్నామని ఆమె వివరించారు. పారిశుధ్య కార్మికుల పట్ల సమాజంలో గౌరవభావం పెంపొందాలని, ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని ఉద్ఘాటించారు.
సుళ్ళూరుపేట మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు సజావుగా సాగేలా చూడటంలో కమిషనర్ చిన్నయ్య మరియు స్థానిక నాయకులు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. కార్మికులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్పందించి, వారిని సమన్వయం చేసుకుంటూ మున్సిపాలిటీని ప్రగతిపథంలో నడిపిస్తున్న తీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కార్మికులందరూ ఇదే నిబద్ధతతో పనిచేస్తూ, పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆమె పిలుపునిచ్చారు.




