Sullurupeta: కళంగి నది ఒడ్డున వ్యర్థాల నిల్వపై అధికారుల ఆకస్మిక తనిఖీ!

Sullurupeta: జాతీయ రహదారి, కళంగి నది ఒడ్డున పేరుకుపోయిన వ్యర్థాలపై ఎంపీడీవో వై.వెంకటేశ్వర రావు అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 23 July 2026 10:11 PM IST
Sullurupeta
X

Sullurupeta: కళంగి నది ఒడ్డున వ్యర్థాల నిల్వపై అధికారుల ఆకస్మిక తనిఖీ!

సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణ పరిధిలోని ప్రసిద్ధ లతికా రెస్టారెంట్ సమీపంలో, జాతీయ రహదారి (హైవే) మరియు కళంగి నది వడ్డున కోటపోలూరు గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న వ్యర్థాల నిల్వపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి వై. వెంకటేశ్వర రావు ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నెలకొన్న దుస్థితిని స్వయంగా పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ​ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ పరిధిలోని కొందరు బాధ్యతారహితమైన దుకాణాదారులు తమ వ్యాపార సంస్థల చెత్తాచెదారంతో పాటు మృత కళేబరాలను ఇష్టానుసారంగా తెచ్చి వేస్తున్నట్లు అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించారు. దీనివల్ల నిత్యం వెలువడుతున్న తీవ్రమైన దుర్వాసనతో స్థానిక ప్రజలు, ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్రమైన అనారోగ్య సమస్యలను, నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

​అంతేకాకుండా, ఆ ప్రాంతానికి వచ్చే యాచకులు మరియు కొందరు అసాంఘిక వ్యక్తులు అక్కడ పారవేసిన వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల, పైనుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లు కరిగిపోయి తరచూ కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ సంబంధిత వ్యక్తుల్లో ఎలాంటి మార్పు రాలేదని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

​కావున సూళ్ళూరుపేట మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి, ప్రస్తుతం అక్కడ పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిగా తొలగింపజేయాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా వ్యర్థాలు పడేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఆరోగ్యానికి, విద్యుత్ వ్యవస్థకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని వారు స్పష్టం చేశారు.

​ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వై. వెంకటేశ్వరరావుతో పాటు, పంచాయతీ అభివృద్ధి అధికారి కే. సుమతి, గ్రామ సచివాలయ ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనీల్ తదితరులు పాల్గొని పరిస్థితిని పూర్తిగా సమీక్షించారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story