Naidupet: ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయశ్రీ
Naidupet: నాయుడుపేటలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాదయాత్ర నిర్వహించి, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. పట్టణ అభివృద్ధే ధ్యేయమన్నారు.
Naidupet: ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయశ్రీ
నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ సమగ్ర అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ స్పష్టం చేశారు. నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేట, అరుంధతీవాడ మాతమ్మ గుడి వద్ద ప్రారంభమైన భారీ ర్యాలీ స్థానిక హరిజనవాడ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తండ్రి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మరియు నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు 786 రఫీలతో కలసి ఎమ్మెల్యే విజయశ్రీ అడుగులు వేశారు.
కాలనీలోని వీధుల్లో ఎండను సహితం లెక్కచేయకుండా కాలినడకన పర్యటించిన ఎమ్మెల్యే విజయశ్రీ, స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆమె, లబ్ధిదారుల వద్దకే వెళ్లి స్వయంగా 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్లను పంపిణీ చేశారు. వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఎమ్మెల్యేను చూసి స్థానిక ప్రజలు, మహిళలు, వృద్ధులు హారతులతో, ఆత్మీయ ఆలింగనాలతో ఘనంగా స్వాగతం పలికారు.
ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ, వారికి కొండంత అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. "ఎంతో మంది నాయకులను చూశాం కానీ, ఇలా స్వయంగా కాలనీలో నడుస్తూ, ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ మా ముంగిట నిలిచిన ప్రజాప్రతినిధిని ఎప్పుడూ చూడలేదు" అంటూ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో నాయుడుపేటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు వెంకటగిరి రోడ్డులోని స్వర్ణముఖి నది వరకు రోడ్డు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను పూర్తి చేస్తామన్నారు. పట్టణ ప్రజల శాశ్వత తాగునీటి అవసరాల కోసం ₹226 కోట్ల అంచనా వ్యయంతో కేపీ కెనాల్ అనుసంధాన ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపారు.
అర్హులైన నిరుపేదలు టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ, నియోజకవర్గంలో 90 శాతానికి పైగా అర్హులకు మూడు దశల్లో నూతన పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. నిరుపేద కార్మికులకు అన్నా చెరువు వద్ద ఇళ్ల పట్టాలు అందేలా కృషి చేస్తామని, అసెంబ్లీలో కార్మికుల హక్కుల కోసం గళమెత్తుతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి 'సూపర్ సిక్స్' పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




