Tada: తడ మండలం మాంబాట్టు అపాచీ కంపెనీలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు

Tada: తిరుపతి జిల్లా తడ మండలం అపాచీ షూ కంపెనీలో మహిళా భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 28 May 2026 7:07 PM IST
Tada
X

Tada: తడ మండలం మాంబాట్టు అపాచీ కంపెనీలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు

తడ: మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సమాజంలోనూ, పని ప్రదేశాల్లోనూ మహిళలకు అత్యంత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తడ మండలం మాంబాట్టు పారిశ్రామిక ప్రాంతంలోని ప్రముఖ అపాచీ షూ కంపెనీలో మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు హాజరుకాగా, వారితో పాటు సూళ్ళూరుపేట సీఐ మురళీకృష్ట, తడ ఎస్ఐ కొండప్ప నాయుడు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా మొదటిగా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ మహిళల భద్రత కోసం తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ఎస్పీ ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయాన్ని ఏ విధంగా పొందాలో వివరించిన ఆయన, వేధింపులకు గురైనా లేదా భద్రతా పరమైన ఎలాంటి సమస్యలు తలెత్తినా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ధైర్యం చెప్పారు. చట్టాల పట్ల, మహిళలకు ఉన్న ప్రత్యేక హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.

​అనంతరం సూళ్ళూరుపేట సీఐ ఎం.మురళీకృష్ట మాట్లాడుతూ మహిళలు ఎక్కడా అధైర్యపడాల్సిన అవసరం లేదని, రక్షణ కోసం ఎల్లప్పుడూ పోలీసులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. సాంకేతికతను వాడుకుంటూ అత్యవసర సమయాల్లో పోలీసులను ఎలా సంప్రదించాలో వివరించారు. మహిళలు ప్రయాణాల సమయంలో గానీ, రాత్రి వేళల్లో విధులు ముగించుకుని వెళ్లేటప్పుడు గానీ అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ అవగాహన సదస్సులో అపాచీ కంపెనీకి చెందిన సుమారు 500 మంది మహిళా ఉద్యోగులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొనగా, వారు అడిగిన పలు సందేహాలను డీఎస్పీ, సీఐ మరియు పోలీస్ అధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story