Sullurpeta: బడా హోటళ్ల బరితెగింపు.. నడిరోడ్డుపై అక్రమ పార్కింగ్!

Sullurpeta: సూళ్ళూరుపేటలో ప్రముఖ ప్రైవేట్ హోటళ్లు ప్రధాన రహదారిని ఆక్రమించి అక్రమ పార్కింగ్‌కు పాల్పడుతున్నా అధికారులు మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

KKV Sudhakar, Sullurupeta
Published on: 12 Nov 2026 11:58 AM IST
Sullurpeta
X

Sullurpeta: బడా హోటళ్ల బరితెగింపు.. నడిరోడ్డుపై అక్రమ పార్కింగ్!

Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని ప్రముఖ ప్రైవేట్ హోటళ్ల దౌర్జన్యం ఇక్కడ పరిమితులు దాటిపోతోంది! ప్రజా రహదారిని తమ సొంత ప్రైవేట్ పార్కింగ్ స్థలంగా మార్చేసుకుని, నడిరోడ్డుపై ఇష్టారాజ్యంగా కార్లు, బైక్‌లను నిలిపివేస్తూ వాహనదారుల ప్రాణాలతోచెలగాటమాడుతున్నాయి ఈ హోటళ్లు.

ఈ ప్రైవేట్ హోటళ్ల నిర్వాహకుల అక్రమాల వల్ల ప్రధాన రహదారిలో ఏకంగా 75 శాతానికి పైగా భాగం ఆక్రమణల పాలైంది. కేవలం 25 శాతం రోడ్డు మాత్రమే మిగలడంతో నిత్యం పారిశ్రామిక వాహనాలు, స్థానిక ప్రజల వాహనాలు గంటల తరబడి కిలోమీటర్ల మేర తీవ్ర ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి.

​'రాకెట్ సిటీ'గా పేరొందిన సూళ్ళూరుపేట చుట్టూ బహుళజాతి పరిశ్రమలు కొలువుదీరడంతో నిత్యం పరిశ్రమల వాహనాలు, వేలాది మంది ఉద్యోగుల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిని ఈ హోటళ్లు పూర్తిగా కబ్జా చేశాయి.

ఇంత జరుగుతున్నా అధికారులకు ఈ హోటళ్లపై చర్యలు తీసుకునే ధైర్యం లేకపోవడం గమనార్హం! సుమారు నెల రోజుల క్రితం పోలీస్ శాఖ అధికారులు ఇక్కడ ఆర్భాటంగా 'నో పార్కింగ్' బోర్డులు ఏర్పాటు చేసినా, హోటల్ నిర్వాహకులు వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా యథేచ్ఛగా అక్రమ పార్కింగ్ కొనసాగిస్తున్నారు.

​ఇంకా దారుణమైన విషయమేమిటంటే... ఈ ప్రైవేట్ హోటళ్ల సిబ్బంది బరితెగించి "మా దగ్గర విపరీతంగా డబ్బుంది, పైన పెద్ద నెట్‌వర్క్ ఉంది, మాకు ఎవరి భయం లేదు, ఎన్ని వార్తలు రాసుకున్నా ఏమీ చేయలేరు" అంటూ బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు!

ఒక పేద సామాన్యుడు తన కుటుంబ పొట్టకూటి కోసం రోడ్డు పక్కన చిన్న వ్యాపార బండి పెట్టుకుంటే చాలు, వందల నిబంధనలు చెప్తూ విరుచుకుపడే అధికారులకు... రోడ్డును ఆక్రమించి ట్రాఫిక్ నరకం చూపుతున్న ఈ హోటళ్లు ఎందుకు కనిపించడం లేదు? ఈ హోటళ్లకు అధికారులు ఇస్తున్న ఈ ప్రత్యేక మినహాయింపు వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి?

​ఉన్నవారికి ఒక రూలు, లేని సామాన్యులకు మరొక రూలా? అధికారుల ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న మతలబు ఏమిటి? నిత్యం వేలాది మంది ప్రజలు, పరిశ్రమల వాహనాలు తిరిగే ఈ రహదారిపై 75 శాతం ఆక్రమణలు ఉంటే అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి మౌనంగా ఉన్నారు?

చట్టం ముందు అందరూ సమానమే అయితే ఈ ప్రైవేట్ హోటళ్లపై చర్యలు ఎందుకు తీసుకోరు? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఈ ప్రైవేట్ హోటళ్ల అక్రమ పార్కింగ్‌లు, ఆక్రమణలను తొలగించి, రద్దీ నుండి ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించాలని సూళ్ళూరుపేట ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు!

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta