Puttur: మహారథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి!
Puttur: తిరుపతి జిల్లా పుత్తూరులో శ్రీ ద్రౌపతీ సమేత ధర్మరాజు స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం వైభవంగా జరిగింది.
Puttur: మహారథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి!
పుత్తూరు: శ్రీ ద్రౌపతి దేవి సమేత శ్రీ ధర్మరాజు రాజుల తిరునాళ్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుత్తూరు పట్టణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన మహారథోత్సవం భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వస్త్రాలు, విశిష్ట అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మహారథంపై స్వామివార్లు పురవీధుల్లో విహరించగా, భక్తులు హారతులు పట్టి స్వామివారిని దర్శించుకున్నారు.
రథ, గజ, తురగ, పదాతులతో పాటు 20 రకాల రాజ వేషధారణలతో నిర్వహించిన మహారథోత్సవం ఆలయ సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించింది. మంగళ వాయిద్యాల నడుమ పట్టణ ప్రధాన వీధుల గుండా మహారథం ఘనంగా ఊరేగింది. మహారథం పునర్నిర్మాణ దాత వసంత్ తరుణ్ కుమార్ రథానికి నూతన వస్త్రాలు సమర్పించారు. బొల్లిని దివాకర్ నాయుడు, బొల్లిని జయరాం నాయుడు రథోత్సవ సేవల్లో పాల్గొన్నారు.
మహారథోత్సవ ఉభయదారులుగా ఎగు కనకంపాలెం గ్రామానికి చెందిన కోరా ధనుంజయ నాయుడు, కోరా శ్రీదేవి దంపతులు వ్యవహరించారు. రథోత్సవానికి ముందుగా శ్రీకృష్ణ రథం పట్టణ వీధుల్లో భక్తులను అలరించగా, అనంతరం ఘటోత్కచ వాహనం ఊరేగింపుగా సాగింది. పుత్తూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మహారథోత్సవం ధర్మరాజు రాజుల తిరునాళ్లలో అత్యంత విశిష్ట ఘట్టంగా భావిస్తారు. ధర్మం, న్యాయం, ప్రజాక్షేమానికి ప్రతీకలైన ధర్మరాజు రాజుల దివ్య దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.




