Renigunta: వృద్ధులకు పెన్షన్ ఇవ్వండి ధ్రువీకరణ పత్రాల పేరుతో వేధించొద్దు!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తులకు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Renigunta: వృద్ధాప్య పెన్షన్‌కు కుల ధ్రువీకరణ నిబంధన తొలగించాలి!
Renigunta: వృద్ధాప్య పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో కుల ధ్రువీకరణ పత్రం అడగడంపై పలువురు అభ్యర్థులు, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన, తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలు వృద్ధాప్య పెన్షన్‌కు అర్హులైనప్పుడు కుల ధ్రువీకరణ పత్రం ఎందుకు కోరుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
వితంతు పెన్షన్‌కు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, దివ్యాంగుల పెన్షన్‌కు సదరం (SADAREM) ధ్రువీకరణ పత్రం కోరడం సమంజసమేనని, అయితే వృద్ధాప్య పెన్షన్‌కు కుల ధ్రువీకరణ పత్రంతో సంబంధం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వయోభారంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు ధ్రువీకరణ పత్రాల కోసం ఎంఆర్‌ఓ కార్యాలయాలు, సచివాలయాలు, మీ-సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పెన్షన్ దరఖాస్తులకు కేవలం వారం రోజుల గడువు ఇవ్వడంతో ఇబ్బందులు మరింత పెరిగాయని చెబుతున్నారు. కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో సర్వర్లు, వెబ్‌సైట్లు పనిచేయకపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, దీనిని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు, వయస్సు నిర్ధారణకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉంటే వృద్ధాప్య పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, కుల ధ్రువీకరణ పత్రం నిబంధనను తొలగించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సాధ్యంకాని పక్షంలో దరఖాస్తుల గడువును పొడిగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పేదలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన సంక్షేమ పథకాలు వారిని మరింత ఇబ్బందులకు గురిచేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.




