Renigunta: రేణిగుంట దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
Renigunta: రేణిగుంటలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. పాత కక్షలతో బాధితుడిపై దాడి చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన రేణిగుంట సిఐ జయచంద్ర బృందం.
Renigunta: రేణిగుంట దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
రేణిగుంట: రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దోపిడీ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రేణిగుంట ఎస్డీపీఓ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, సీఐ ఎస్. జయచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితులను అదుపులోకి తీసుకుంది.
అరెస్టైన నిందితులు వెంకటగిరి వివేక్ (22), ఆవుల లక్ష్మణ కుమార్ అలియాస్ అఖిల్ (23)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గతంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారు గొలుసు దోపిడీ కేసులో జైలుకు వెళ్లి ఇటీవల విడుదలయ్యారు.
ఆ కేసులో తమ అరెస్టుకు బాధితుడే కారణమని భావించిన నిందితులు, ఈ నెల 6న రాత్రి బాధితుడిని ఇంటి సమీపానికి పిలిపించి బెదిరించి దాడి చేసి, రూ.1,000 నగదును బలవంతంగా అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. కేసులో ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ప్రజలు బెదిరింపులు, దోపిడీలు, దాడులు లేదా ఇతర నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.




