Renigunta: పోలీసుల మెరుపు దాడి..భారీగా పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం!
Renigunta: రూ.2.50 లక్షల విలువైన 11.12 టన్నుల ప్రభుత్వ పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు
Renigunta: పోలీసుల మెరుపు దాడి..భారీగా పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం!
రేణిగుంట: పోలీసులు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం అక్రమ రవాణాను భగ్నం చేసి, భారీ మొత్తంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో,ఇన్స్పెక్టర్ ఎస్. జయచంద్ర ఆదేశాల మేరకు ఎస్ఐ వై. శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది మంగళవారం ఉదయం చెంగారెడ్డిపల్లి క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి వైపు నుంచి వస్తున్న AP 39 TU 8938 నంబరు గల వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా చెంగారెడ్డిపల్లి గ్రామం చివరలోని డెల్మాన్ ఫంక్షన్ హాల్ సమీపంలో నిలిపి, వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు పారిపోయేందుకు యత్నించారు.
అయితే పోలీసులు వెంటాడి వారిని అదుపులోకి తీసుకున్నారు.విచారణలో నిందితులు సి.రాజా (20), గురువేంద్ర (24),చల్ల గోపాల్ వైశ్యరి (26)గా గుర్తించారు.
వీరంతా తొట్టంబేడు మండలం చిలకవారి కండ్రిగ గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో శ్రీకాళహస్తికి చెందిన మణి అనే వ్యక్తి ఆదేశాల మేరకు గ్రామస్తుల వద్ద నుంచి ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేసిన పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, చెంగారెడ్డిపల్లిలోని గోదాములో నిల్వ చేసి, అక్కడి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు వెల్లడించారు.
తనిఖీల్లో వాహనంలో 79 బస్తాల్లో 3,792 కిలోలు, గోదాములో 147 బస్తాల్లో 7,328 కిలోలు లభ్యమయ్యాయి. మొత్తంగా 226 బస్తాల్లో 11,120 కిలోల ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.నిందితులపై కేసు నమోదు చేసి,బియ్యం,వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ శాఖ అధికారులకు అప్పగించగా, కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం లేదా ఇతర నిత్యావసర వస్తువుల అక్రమ రవాణా, నిల్వ,విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని రేణిగుంట పోలీసులు ప్రజలను కోరారు.




