Renigunta: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రూ.2 లక్షల జరిమానా

Renigunta: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మరోసారి పేకాట ఆడుతూ పట్టుబడిన ఎల్.ఎన్. కండ్రిగ వాసి నాగరాజు రెడ్డికి రూ.2 లక్షల జరిమానా విధించిన రేణిగుంట తహసీల్దార్.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 23 Nov 2026 6:11 PM IST
Renigunta
X

Renigunta: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రూ.2 లక్షల జరిమానా

రేణిగుంట: రేణిగుంట మండలం కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని ఎల్.ఎన్. కండ్రిగ గ్రామానికి చెందిన ధర్మారెడ్డి నాగరాజు రెడ్డి (47)పై గతంలో రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడిపందాలు, పేకాటకు సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 22న రేణిగుంట మండల తహసీల్దార్ సమక్షంలో పోలీసులు అతనిపై బైండోవర్ చర్యలు చేపట్టారు.

అయితే బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెప్టెంబర్ 28న ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ పట్టుబడటంతో మరో కేసు నమోదైంది. ఈ విషయాన్ని రేణిగుంట సీఐ ఎస్. జయచంద్ర, ఎస్ఐ వై. శ్రీనివాసులు ఈ నెల 23న తహసీల్దార్ శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బైండోవర్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 14 రోజుల జైలు శిక్ష లేదా రూ.2 లక్షల జరిమానా విధించగా, నాగరాజు రెడ్డి జరిమానా చెల్లించారు.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA